calender_icon.png 19 April, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ మారే ప్రసక్తే లేదు: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

16-04-2025 01:39:05 AM

జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో తన సీనియార్టీ కి తగిన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనే తప్పా తనకు పార్టీ మారే ఉద్దేశం ఎంత మాత్రం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో  మంగళవారం ఏర్పాటుచేసిన  ప్రెస్ మీట్ లో జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక బిఆర్‌ఎస్ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం పట్ల జీవన్ రెడ్డి మొదటి నుండి వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

అయినప్పటికీ అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే విధంగా ఎలాంటి ప్రయత్నం చేయకపోవడంతో జీవన్రెడ్డి గత కొంతకాలంగా వివిధ సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ పై తన అసంతృప్తిని  వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నట్లు  ఉహగానాలు చెలరేగాయి.దాంతో జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన  వివరణ ఇచ్చారు.. 

తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారడం లేదన్నారు. పార్టీ గడ్డు కాలంలో ఉన్నప్పుడు ఒంటరిగా పొరాటం చేసిన వ్యక్తినని, తాను పార్టీ ఎలా మారుతానని ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో వి.హన్మంతరావు తర్వాత తానే సీనియర్ నని తన తర్వాత నాలుగేళ్లకు జానారెడ్డి పార్టీలోకి  వచ్చారని చెప్పుకొచ్చారు. ఇంత సీనియర్గా ఉండి కూడా  కాంగ్రెస్ పార్టీలో  తన స్థానం ఏమిటీ అనే బాధ తనకు ఉందని జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నానని అన్నారు.. రాష్ట్రంలో కొందరు సీనియర్ నేతలు పార్టీపై  అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడటంపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ అది వారి,వారి వ్యక్తిగత అభిప్రాయమని వారి గురించి తాను ఏ వ్యాఖ్యలు చేయనని జీవన్ రెడ్డి అన్నారు.