- కంపెనీల విలువ పెరుగుతున్నా.. పెరగని జీతాలు
- ఇలా అయితే వికసిత్ భారత్-2047 లక్ష్యం నెరవేరేదెలా?
న్యూఢిల్లీ, జూలై 22: ఆధునిక భారతంలో అనేక కంపెనీల మార్కెట్ విలువ రాకెట్‌లా దూసుకుపోతుంది. కానీ అందులో పని చేసే ఉద్యోగుల జీతాలే పెరగడం లేదు. ఇవేవో గాలి వాటంగా చెప్పిన ముచ్చట్లు కాదు. స్వయాన మన భారత ప్రభుత్వమే చెప్పింది. ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో 2023 సంవత్సర ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టింది. ఈ సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఒక్క జీతాలు తప్ప కంపెనీల ఆర్థిక స్థితిగతులు, అవి కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడాలు అంతా బాగానే ఉన్నాయి.
కానీ జీతాల విషయం మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ప్రైవేటు సెక్టార్‌లో ఉద్యోగాల కల్పన భేష్ అంటూ ప్రభుత్వం జబ్బలు చరుచుకుంది. కానీ అదే సమయంలో ఆ ఉద్యోగులు సరైన జీతాలు లేవనే విషయం మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇక కార్పొరేట్ రంగం చూసుకుంటే ఎన్నడూ లేనంత ఉన్నతిని సాధించింది. ఇదంతా బాగుంది కానీ జీతాల విషయానికి వచ్చేసరికే అంతా పిల్లి మొగ్గలేస్తున్నారు. దేశవ్యాప్తంగా 33 వేల కంపెనీల నుంచి ఈ శాంపిల్స్ తీసుకుని నివేదిక తయారు చేశారు. 2020 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఇండియన్ కార్పొరేట్ సెక్టార్ విలువ నాలుగు రెట్లు పెరిగింది. అంతే కాకుండా ఉద్యోగ నియామకాలు కూడా బాగానే పెరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
ఆ ఒక్కటీ అడక్కు..
కంపెనీల మార్కెట్ విలువ రాకెట్‌లా దూసుకుపోయిందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కంపెనీల విలువ ఎంతలా పెరిగినా ఉద్యోగుల జీతభత్యాలు మాత్రం పెరగలేదు. అసంఘటిత రంగంలో 2015 11.1 కోట్ల మంది ఉండగా.. ప్రస్తుతం 10.96 కోట్ల మంది మాత్రమే ఉన్నారు.
ఆ రెండింటి వల్లే..
భారత ఆర్థిక రంగం రెండు పెద్ద విపత్తులను ఎదుర్కొంది. బ్యాంకింగ్ రంగానికి మొండిబకాయిలు, కార్పొరేట్ బకాయిలు.. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ మొదటి టర్మ్‌లో వీటి వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక తర్వాత కొవిడ్.. మొదటి విపత్తు నుంచి కోలుకునే వరకే ఈ విపత్తు వచ్చి పడింది. అందువల్లే మరిన్ని ఉద్యోగాల కల్పన చేయడం సాధ్యపడలేదు అని సర్వేలో పేర్కొన్నారు. ఏఐ వల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా కానీ వాటన్నిటినీ అధిగమించి ఇండియా ముందుకు వెళ్తోందని సర్వే స్పష్టం చేసింది. 2023లో ప్రచురించిన చివరి ఆర్థిక సర్వేకు ఇప్పటి సర్వేకు ప్రపంచ భౌగోళిక పరిస్థితుల్లో అనేక మార్పులు సంభవించాయి. భారత ప్రభుత్వ లక్ష్యం వికసిత్ భారత్ పెద్ద ఆటంకంగా మారింది. 1980 మధ్య కాలంలో చైనా ఎలా అభివృద్ధిలో దూసుకుపోయిందో మన దేశాన్ని కూడా అలా చేయడమే వికసిత్ భారత్ లక్ష్యం. కానీ అప్పుడున్న భౌగోళిక పరిస్థితులు చైనాకు అండగా నిలిచాయి. ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దోహదం చేశాయి. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితులు అలా లేవు.
భారత్ అంటే మాటలా..
సవాళ్లు ఎన్ని ఎదురయినా కానీ భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా నిలబడింది అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కొవిడ్ పాండమిక్ తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకున్న తీరును ఆమె ప్రశంసించారు. అందరి అంచనాలను అందుకునేందుకు ఇంకా ఎన్నో చేయాల్సి ఉందన్న నిర్మలమ్మ ఈ ఆర్థిక సంవత్సరానికి 6.5 శాతం వరకు జీడీపీ వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల ద్రవ్యోల్బణం పెరగకుండా కట్టడి చేసినట్లు ఆమె వివరించారు. 2023 ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 2024 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతంగా నమోదయినైట్లు ఆమె పేర్కొన్నారు.