మతాంతర వివాహాలు మెరుగైన సమాజం కోసం ఎంతో అవసరం...
హైకోర్టు జస్టిస్ డాక్టర్ గురిజా రాధారాణి, మానవ హక్కుల సంఘం మాజీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య..
కులాంతర, మతాంతర వివాహితుల మేళా..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ప్రస్తుతం ఉన్న సమాజంలో కులాన్ని పట్టించుకోవాల్సినవసరం లేదని, కులాంతర మతాంతర వివాహాలు మెరుగైన సమాజం కోసం ఎంతో అవసరమని తెలంగాణ హైకోర్టు జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి, మానవ హక్కుల సంఘం మాజీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. కులాంతర మతాంతర, వివాహాలు చేసుకున్న వారి పిల్లలు అత్యంత నైపుణ్యవంతమైన జెనిటిక్స్‌తో సమాజంలో రాణిస్తున్నాని వారు గుర్తు చేశారు. కులాంతర మతాంతర వివాహాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని వారు పేర్కొన్నారు. కుల నిర్మూలన సంఘం 53వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఇందిరాపార్కులో కులాంతర మతాంతర వివాహితుల మేళాను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న దంపతులను పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులు తమ అభిప్రాయాలను వేదికపై పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన హైకోర్టు జస్టిస్ రాధారాణి, మానవ హక్కుల సంఘం మాజీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, ఆరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క, విశిష్ట అతిధి డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి, మూడనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు బైరి నరేష్, కుల నిర్మూలన సంఘం ఎండీ వహీద్, ఉపాధ్యక్షురాలు వై. జ్యోతి, సయ్యద్ యూసఫ్ బీ, డి. జగదీపం, డాక్టర్ లయన్ ఇ. సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి డీఎల్ కృష్ణచంద్ హాజరయ్యారు. ఈ సందర్బంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ భక్తి గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమానికి కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన సుభ్రాంత్ను, విద్యార్థులను అతిధులు ఘనంగా సత్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ... గత 53 సంవత్సరాలుగా ఇందిరాపార్కులో కులాంతర మతాంతర వివాహితుల మేళా ఏర్పాటు చేసి అలాంటి వివాహాలు చేసుకున్న వారిని ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో తమ సంపూర్ణ సహకారం, కుల నిర్మూలన సంఘం, వివాహితుల మేళా నిర్వహించే వారికి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కే. సురేష్, రవి, షాప్, స్వరాజ్యలక్ష్మీ, నందకుమార్, లక్ష్మీదేవి, జగదీశ్వర్, అలివేలు మంగ, ఈశ్వర్ లింగంతో పాటు కులాంతర వివాహాలు చేసుకున్న కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.