బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): గత 9 నెలలుగా రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రే లేడని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్(ఆర్‌ఎస్‌పీ) అన్నారు. ఆ శాఖ తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా ఆ శాఖపై సమీక్ష నిర్వహించలేదని ఆయన మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆర్‌ఎస్‌పీ మాట్లాడుతూ.. విద్యాశాఖపై సీఎంకు కనీస అవగాహన కూడా లేదన్నారు. ఖైదీల తిండి కోసం రూ.83 ఖర్చు చేస్తున్న సర్కార్.. విద్యార్థులకు మాత్రం రూ.37 మాత్రమే ఇస్తోందని.. దీని కారణంగా విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం యూనిఫామ్స్ లేవని, చలికాలం వస్తున్నా రగ్గులు ఇవ్వలేదని మండిపడ్డారు. ఫీజ్ రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కోర్సులు పూర్తియినప్పటికీ విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ గురుకులాలను 250 నుంచి 1000కి పెంచితే కాంగ్రెస్ సర్కార్ వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మహబూబ్‌నగర్‌లో పేదల ఇండ్లు కూల్చేసిన అధికారులు దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్న ధనికుల ఇళ్లు, అపార్ట్‌మెంట్లను కూడా కూల్చేయాలన్నారు. రాష్ట్రంలో పేదలపై ప్రతీకార పాలన కొనసాగుతోందని ఆర్‌ఎస్‌పీ దుయ్యబట్టారు.