calender_icon.png 23 February, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరుగుతో.. స్పెషల్స్!

16-02-2025 12:00:00 AM

వాతావరణం మారింది. ఎండలు మొదలయ్యాయి. నోరు ఎండుకపోవడం.. కడుపు మంట, నీరసం అనిపించడం సర్వసాధారణం. అయితే ఈ ఎండల వేడి నుంచి ఉపశమనం పొందాలంటే.. పెరుగుకు మించిన ఔషధం లేదు. ఎన్ని జ్యూస్‌లు తాగినా కడుపు చల్లబడదు. ఒక గ్లాసు మజ్జిగ, ముద్ద పెరుగు అన్నం తింటేనే కడుపు చల్లబడుతుంది. వేడి నుంచి శరీరాన్ని చల్లబర్చడంలో పాటు శక్తిని అందించడంలో పెరుగుది ప్రధాన పాత్ర. నీరసం, వేడిని తట్టుకోవాలంటే ఈసారి పెరుగుతో తయారుచేసిన స్పెషల్స్‌ను ప్రయత్నించండి.   

మజ్జిగ పులుసు

కావాల్సిన పదార్థాలు: పుల్లటి పెరుగు, సోరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు రెమ్మలు, శనగపిండి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నూనె. 

తయారీ విధానం: అర లీటరు పుల్లని పెరుగును తీసుకుని సుమారు నాలుగు చెంచాల శనగపిండి నీటిలో ఉండలు లేకుండా కలిపి మజ్జిగ తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో కూరగాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. అందులోనే ముందుగా తయారు చేసుకున్న మజ్జిగ వేసి ఒక పది నిమిషాలు స్టవ్ సీమ్‌లో ఉంచి మరిగించుకోవాలి. తర్వాత మరో గిన్నెలో పోపు గింజలు, ఇంగువ వేసి వేయించాలి. తర్వాత పోపును మరుగుతున్న మజ్జిగ పులుసులో వేసుకుని కొంచెం కొత్తిమీర వేసి రెండు నిమిషాలు మరిగించుకోవాలి. అంతే ఎంతో టేస్టీ టేస్టీ మజ్జిగ పులుసు రెడీ. 

పెరుగు పచ్చడి

కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల పెరుగు, కొంచెం తరిగిన కొత్తిమీర, రెండు తరిగిన పచ్చిమిర్చి, సగం చెంచా జిలకర్ర, కొద్దిగా అల్లం పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, చెంచా నువ్వులు, చెంచా నూనె, సగం చెంచా పసుపు, రెండు ఎండు మిరపకాయలు. 

తయారీ విధానం: ఒక పాన్‌లో నూనె వేడి చేసి.. ఆవాలు, ఎండు మిరపకాయలు వేయాలి. దాంట్లోనే అల్లం, జిలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మరో నిమిషం పాటు వేయించాలి. ఈ కూరను పెరుగులో వేసి బాగా కలపాలి. చివరగా నువ్వులు వేసి కలిపితే.. పెరుగు పచ్చటి రెడీ!.  

స్వీట్ లస్సీ

కావాల్సిన పదార్థాలు: పెరుగు కప్పులు, చక్కెర సరిపడా, పిస్తా పలుకులు కోసం.

తయారీ విధానం: పెరుగును బాగా చిలికి.. చల్లని నీళ్లు పోసి బాగా కలపాలి. దీంట్లో చక్కెర సిరప్ లేదా చక్కెరను వేసి రుచిని బట్టి కలుపుకోవాలి. చిటికెడు ఉప్పు కలుపుకుంటే మరింత రుచి బాగుంటుంది. అయితే దీన్ని సర్వ్ చేసేముందు పిస్తా పలుకులు వేయాలి. చాలా ఈజీగా, టేస్టీగా ఉండే లస్సీ రెడీ అయినట్టే. ఇది వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. 

రైత

కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెరుగు, సగం కప్పు దోసకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, రెండు తరిగిన పచ్చిమిర్చి, ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు   

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో చిక్కటి పెరుగును తీసుకుని దాంట్లో ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిశాక.. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.