26-02-2025 12:00:00 AM
నిధులు లేవని చేతులెత్తేసిన పంచాయతీ అధికారులు
దోమల నివారణ మందుకు కూడా నిధులు కరువు
బోరు మోటార్ల మరమ్మతు కూడా చేయలేని దుస్థితి
వెల్దుర్తి, ఫిబ్రవరి 25: ఉమ్మడి వెల్దుర్తి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. సుమా రు 12 నెలలుగా గ్రామపంచాయతీలలో నిధులు లేక జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెడుతూ అష్ట కష్టాల నడుమ గ్రామపంచాయతీలో పారిశుద్ధ పనులు చేయిస్తున్నారు. ఉమ్మడి మండలంలో రెండు మూడు మేజర్ పంచాయతీలు తప్ప మిగతావన్నీ చిన్న గ్రామపంచాయతీలు. మేజర్ గ్రామ పంచాయతీలకు కొద్దిపాటి నిధులు ఉన్నా, చిన్నచిన్న గ్రామ పంచాయతీలో నిధులు లేక పారిశుద్ధ్యము, అభివృద్ధి కుంటుపడిన పరిస్థితి ఏర్పడింది.
సర్పంచ్ ఎన్నికలు త్వరగా వస్తే తమ కష్టాలు తీరుతాయని, పెట్టిన డబ్బులు తిరిగి తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఖర్చు పెట్టే అవసరం ఉండదని ఇటు తాజా మాజీ సర్పంచ్లు, కార్యదర్శులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఇప్పట్లో ఏ ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఉమ్మడి వెల్దుర్తి మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు పెట్టలేక తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.
ఇప్పటివరకు శక్తి మేరకు నెట్టుకొస్తున్నామని, ఇక ముందుకు ఖర్చు పెట్టడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని, ప్రత్యేక నిధులు విడుదల చేస్తే తప్ప గ్రామ పంచాయతీలో పారిశుధ్యం అభివృద్ధి పనులు చేపట్టలేమని ఉమ్మడి వెల్దుర్తి మండల ఎంపీడీవోలకు గ్రామ కార్యదర్శులు వినతి పత్రం కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులను చెల్లించాలని, అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధుల సమస్య లేకుండా చేయాలని మండల పంచాయతీ సెక్రటరీలుకోరడంజరిగింది.