28-02-2025 12:32:16 AM
సమస్యలు పరిష్కరిస్తామంటూ ఓట్లు అడిగే నాయకులు ఎక్కడ?
పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోను అడిగినా పట్టింపులేదు
గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర రామ్ నగర్ గ్రామస్థుల ఆందోళన
పరిగి : ఫిబ్రవరి 27:( విజయ క్రాంతి): నిత్య అవసరాలకు తాగునీరు లేక నిత్యం ఇబ్బందుల గురి అవుతున్నామని పరిగి నియోజకవర్గం రామ్ నగర్ గ్రామస్తులు రాంనగర్ పంచాయతీ కార్యాలయం దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం గ్రామంలోని ప్రజలు ఇంటికొకరు చొప్పున నీటి కడువులు తీసుకొని గ్రామం మధ్యలో ఉన్న పంచాయతీ కార్యాలయం దగ్గర చేరుకొని నీటి కడవలతో నిరసన వ్యక్తం చేశారు.
గత మూడు నెలలకి కిందట గ్రామపంచాయతీ బోర్ మోటార్ కాలిపోయింది. ఇప్పటివరకు దానిని రిపేర్ చేయలేదు. గ్రామపంచాయతీ కార్యదర్శి అడిగిన పలుమాలు నేరుగా చెప్పిన పట్టించుకోవడం లేదు. కుల్కచర్ల మండల కేంద్రానికి వెళ్లి ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి సార్. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు గ్రామంలోకి వచ్చి గ్రామంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఇళ్ల చుట్టూ పదుల సార్లు తిరుగుతారు.
మేము మిమ్మల్ని ఏమీ అడగడం లేదు సార్ కనీసం బోరు మోటర్ రిపేర్ చేయించి గ్రామంలో ఉన్న నేటి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో వారి ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు కూడా రావడం లేదని అది పూర్తిగా ఆగిపోయిందని మేము ఎవరికి చెప్పుకోవాలని తొందరగా అధికారులు స్పందించి మా గ్రామంలో తాగునీరు సమస్యను పరిష్కరించాలని రామ్ నగర్ గ్రామస్తులు అధికారులను ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.