నార్నే నితిన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆయ్’. అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మిస్తున్నారు. శుక్రవారం (ఈ రోజు) విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎవరి కష్టం వారు పడాలని ఎన్టీఆర్ అన్నారట.
ఈ సినిమా కోసం నితిన్ కూడా చాలా కష్టపడ్డాడు. నయన్ సారికి ఈ చిత్రంలో చాలా బాగా నటించింది. అంజి ఎలా తీస్తాడో అనుకున్నా. నాది గ్యారెంటీ అని బన్నీ వాస్ అన్నాడు. నేను సినిమాను చూశాను. ఫుల్లుగా ఎంజాయ్ చేసి ఓ ఎమోషన్తో బయటకు వస్తారు’ అని అన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ.. “స్వయంభు’ షూటింగ్ వల్ల బయటకు రాలేకపోతున్నా. సోషల్ మీడియాలో ‘ఆయ్’ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. మంచి సినిమా, యంగ్ టీమ్ ముందుకు వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలని ఇక్కడకు వచ్చాను’ అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీలీలతోపాటు చిత్రబృందం మాట్లాడి, తమ అభిప్రాయాలను పంచుకున్నారు.