calender_icon.png 8 January, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో బెల్ట్ షాపుల జోరు

28-10-2024 01:13:40 AM

  1. హోం డెలివరీతో ప్రోత్సహిస్తున్న వైన్‌షాపులు
  2. ఒక్కో గ్రామంలో మూడు నాలుగు దుకాణాలు
  3. బెల్ట్ షాపుల్లో నిరంతరం మద్యం అమ్మకాలు
  4. అమలుకు నోచుకోని రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీ 

జనగామ, అక్టోబర్ 2౬ (విజయక్రాంతి): ‘ఊరికో మద్యం దుకాణం వల్ల పల్లెలు కరాబ్ అయితున్నయి.. బీఆర్‌ఎస్ మద్యం షాపులను ప్రోత్సహిస్తూ యువకులను తాగుబోతులుగా మారుస్తోంది.. కూలీ కుటుంబాలు మద్యానికి బానిసై చతికలపడుతున్నాయి.. మేం అధికారంలోకి వస్తే బెల్టు తీస్తాం.. గ్రామాల్లో, పట్టణాల్లో నడుస్తున్న బెల్టుషాపులను ఎత్తివేస్తాం’..

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్న మాటలివి. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొదట్లో బెల్టుషాపులను ఎత్తివేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టినట్టు హడావుడి చేశారు. గ్రామాల్లో మద్య నిషేధానికి రంగం సిద్ధమైనట్టు వార్త లు సైతం వచ్చాయి.

కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా బెల్టుషాపుల నిషేధం అమలుకాలేదు. జనగామ జిల్లాలో వెయ్యి కిపైగా బెల్ట్ షాపులుండగా, ఒక్క జిల్లా కేంద్రంలోనే దాదాపు ౪౦ దుకాణాలు ఉన్నాయి. ఈ లెక్కన గ్రామానికి మూడు నాలుగు దుకాణాలు నిరంతరం మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నాయి.  

జిల్లాలో వెయ్యికి పైగా బెల్ట్ షాపులు

బెల్టుషాపులపై అధికార యంత్రాంగం నిఘా పెట్టకపోవడంతో నిర్వాహకులు ఇష్టానుసారంగా నడుపుతున్నారు. జనగామ జిల్లాలో వెయ్యికి పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ అమలులోకి రావడంతో ఎక్సైజ్ అధికారులు జిల్లాలో 645 బెల్టుషాపులను గుర్తించి నిర్వాహకులను బైండోవర్ చేశారు. ఆ తరువాత మళ్లీ దుకాణాలు యథాతథంగా నడుస్తున్నాయి.

అయితే, వాటి సంఖ్య ఇప్పుడు రెట్టింపు అయినట్టు తెలుస్తోంది. కేవలం జిల్లాకేంద్రంలోనే 40 బెల్టుషాపులుండగా.. గ్రామానికి మూడు నాలుగు షాపులు నడుస్తున్నాయని తెలుస్తుంది. ఇక ఈ షాపులు బార్లను తలపించేలా సిట్టింగ్ ఏర్పాట్లు ఉండటం గమనార్హం.  

ఇంటి వద్దకే సరుకు 

కొన్ని చోట్ల బెల్టుషాపులు నిర్వహిస్తున్న ఇంటికే వైన్‌షాపు నిర్వాహకులు మద్యం పంపిస్తున్నారు. బాగా సేల్స్ ఉండే షాపులకు ప్రత్యేకంగా వాహనం సమకూర్చి సమయానికి సరుకు చేరవేరుస్తూ ప్రోత్సాహిస్తున్నారు. బెల్టుషాపులకు ఎమ్మార్పీ కంటే ఒక్కో క్వార్టర్‌కు రూ.10, ఒక్కో బీరుకు రూ.10 చొప్పున ఎక్కువకు విక్రయిస్తుంటారు.

బెల్టుషాపుల్లో ఒక్కో బాటిల్‌పై రూ.30 నుంచి రూ.40 మార్జిన్‌తో విక్రయిస్తుంటారు. ఇలా బెల్టుషాపులకు ఏకమొ త్తంలో సరుకు అమ్మితే ఎక్కువ మార్జిన్ వస్తుండటంతో వైన్‌షాపు యాజమాన్యాలు వాటిని ప్రోత్సహిస్తున్నాయి. ఈ వ్యవహారానికి ఎక్సైజ్ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇకనైనా బెల్టుషాపులను ఎత్తివేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.