calender_icon.png 8 November, 2024 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసిడి వెనుక పెద్ద కథే

10-08-2024 04:10:57 AM

  1. స్వర్ణం గెలిచిన పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 
  2. క్రికెటర్ అవ్వబోయి జావెలిన్ త్రోయర్‌గా 

పారిస్: విశ్రక్రీడలు అంటే మామూలు విషయం కాదు. ఒలింపిక్స్‌లో పతకం గెలవడం ప్రతి క్రీడాకారుడి కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తారు. అవసరం అయితే పస్తులుంటూ రోజులు గడుపుతారు. కానీ పతక కలను మాత్రం వదులుకోరు. గురువారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్  అర్షద్ నదీమ్ బరిసెను 92.97 మీటర్ల దూరం విసిరి ఒలింపిక్ రికార్డుతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 40 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు విశ్వక్రీడల్లో పసిడి పతకం అందించాడు. ఈసారి ఒలింపిక్స్ ముందు కూడా అర్షద్‌కు సరైన జావెలిన్ కూడా లేకపోవడం అతని దీనస్థితిని తెలియజేస్తుంది. చిన్నప్పటి నుంచి చందాలతో శిక్షణలో రాటుదేలిన అర్షద్  ఇవాళ ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణం గెలిచి చరిత్రకెక్కాడు.

ఏడాదికి ఒక్కసారే మటన్

స్వర్ణపతక విజేత అర్షద్ నదీమ్ ఎంత కష్టంలో పెరిగాడో తెలిస్తే వామ్మో అని అనిపిస్తుంది. ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అర్షద్ బాల్యం కష్టాలతోనే సాగింది. అర్షద్ తండ్రి రోజూవారి కూలీ.  అతడికి శిక్షణ కోసం డబ్బులు లేకపోతే ఊర్లో అంతా చందాలు వేసుకుని మరీ శిక్షణ ఇప్పించారు. క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ వంటి ఆటల్లో జిల్లా స్థాయి టోర్నమెంట్‌లు కూడా ఆడాడు. కానీ క్రికెటర్‌గా కెరీర్ ఆరంభిద్దామనుకున్న అర్షద్‌ను.. అథ్లెటిక్స్‌లో అద్భుతంగా రాణించడం చూసిన కోచ్ జావెలిన్ త్రోవైపు నడిపించాడు.

ముస్లిం పర్వదినమైన ఈద్ (రంజాన్) నాడు  మాత్రమే అర్షద్ ఇంట్లో మటన్ వండుతారట. ఇక జావెలిన్ త్రోలో పంజాబ్ యూత్ ఫెస్టివల్స్, ఇంటర్ బోర్డ్ మీట్‌లో వరుసగా స్వర్ణాలు రావడంతో అర్షద్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తాజాగా స్వర్ణం సాధించడంతో సింధ్ ప్రావిన్స్ నదీమ్‌కు రూ. 10 కోట్ల నజరానాను ప్రకటించడం విశేషం.