స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న కొత్త వెబ్‌సిరీస్ ‘సిటడెల్: హనీ-బన్నీ’. ఇది ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సిరీస్ ‘సిటడెల్’కు ఇండియన్ వెర్షన్. రాజ్, డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ వేదికపై ఉన్న తనకు ఎదురైన ప్రశ్నకు సమంత ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. ‘ఇండస్ట్రీలో మహిళల భవిష్యత్తు ఎలా ఉందన్న ప్రశ్నపై సమంత స్పందిస్తూ... ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులతో కలిసి పనిచేసే అవకాశం కల్పించే సినీ పరిశ్రమలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఇండస్ట్రీలో అందరికీ సమాన అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ఇప్పటికే కొంత మార్పు వచ్చింది.
అందులో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది. మన ప్రతిభే మనమేంటో తెలియజేస్తుంది’ అన్నారు. ‘సిటడెల్’ గురించి చెప్తూ.. ‘స్పై జానర్‌కు సంబంధించిన వెబ్‌సిరీస్ అయినా, సినిమా అయినా.. ఎప్పుడూ పురుష పాత్రలకే ప్రాధాన్యం ఉంటుంది. వారే యాక్షన్ చేస్తారు. డైలాగ్స్ చెబుతారు. దానికి భిన్నంగా ఈ సిరీస్‌లో నేను కొంతమేర యాక్షన్ చేశా’ అని చెప్పారు.