calender_icon.png 22 November, 2024 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ పురుగులన్నమే!

22-11-2024 01:45:23 AM

మాగనూర్ బడిలో మళ్లీ కలుషిత ఆహారమే వడ్డింపు

పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన.. స్పందించిన సీఎంవో

డీఈవో సస్పెన్షన్.. ఆర్డీవోకు షోకాజ్‌లు.. 

విచారణకు ఆదేశం

నారాయణపేట, నవంబర్ 21 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూలు మధ్యాహ్న భోజనం కలుషితమై బుధవారం 110 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. యాజమాన్యం విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెంటనే స్పందించి ఘటనకు బాధ్యులైన ఎంఈవో మురళీధర్ రెడ్డి, ఇంచార్జి బాబురెడ్డిని సస్పెండ్ చేశారు. 

వంట ఏజెన్సీ అనుమతులు సైతం రద్దు చేశారు. అయినా.. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు చీమ కుట్టినట్లయినా లేదు. వారు గురువారం మధ్యాహ్నం పాఠశాలకు పంపించిన ఆహారంలో పురుగులు కనిపించడం కలకలం రేపింది. ఈ సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాలకు చేరుకుని ధర్నా చేపట్టారు. ధర్నాపై సీఎంవో స్పందిచింది. డీఈవో అబ్దుల్ ఘనిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆర్డీవో రాంచందర్‌కు షోకాజ్ నోటీసులు అందించింది. మాగనూర్ కలుషిత ఆహారం సరఫరాపై అదనపు కలెక్టర్ బెన్‌షాలం సమగ్రంగావిచారణ చేపడుతున్నారు. 

ఫుడ్‌పాయిజన్‌తో విద్యార్థులు దవాఖాన పాలైనా అదే నిర్లక్ష్యం

ఫుడ్ పాయిజన్‌పై స్పందించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం మాగనూర్ పాఠశాలకు చేరుకున్నారు. వంట గది, స్టోర్ రూమ్‌ను తనిఖీ చేశారు. వంటకు వినియోగించే పదార్థాలను పరిశీలించారు. బుధవారం జరిగిన సంఘటనపై స్వయంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆరా తీశారు. మధ్యాహ్న భోజనాన్ని ఉపాధ్యాయులు రుచి చూసిన తరువాతే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు.

ఆహార నాణ్యత పరిశీలన కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, వారి ఆరోగ్య వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకుంటు న్నామని వెల్లడించారు. కలుషిత ఆహారం ఘటనపై విచారణ నివేదికను సీఎం కార్యాలయానికి నివేదిస్తామని స్పష్టం చేశారు.