calender_icon.png 26 December, 2024 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిజూభాయ్ విలువల విద్యాభ్యాసం

23-06-2024 12:00:00 AM

గడప రఘుపతిరావు :

సులభమైన భాషలో యదార్థ విద్యా పరిస్థితులను విశ్లేషించడంలో గిజూభాయ్‌కి సాటి ఎవరూ లేరు. ఆయన ఉపాధ్యాయుల పరిమితులను, ఇబ్బందులను కూడా బాగా అర్థం చేసుకున్నారు. వారిని బంధించి వుంచిన ఈ వ్యవస్థ క్రూరత్వం కూడా తనకు బాగా తెలుసు. స్కూలు అనే ఎడారిలో పిల్లలు పడే బాధలనూ ఆయన తట్టుకోలేక పోయారు. 

నేడు గిజూభాయ్ వర్ధంతి :

విద్యారంగంలో అత్యంత ప్రధానమైన మూడు ప్రశ్నలు వుంటా యి. ‘ఏం నేర్పించాలి? ఎందుకు నేర్పించాలి? ఎలా నేర్పించాలి?’ వీటి పరిష్కారంపైనే విద్య ప్రయోజకత్వం ఆధారపడి ఉంది. విద్యకు సంబంధించిన ఏ ప్రణాళికలోనైనా, ఏ పద్ధతిలోనైనా ఈ మూడు అంశాలు తప్పకుండా గమనించాలి. ఈ మూడింటినీ చర్చగా సమన్వయ పరిచినపుడే ఫలితాలు మంచిగా మనకందగలవు. ‘ఏం నేర్పించాలి? ఎందుకు నేర్పించాలి?’ అనే రెండూ వ్యక్తి అవసరాలు, సమాజ అవసరాలు, దేశ అవస రాలపై ఆధారపడి ఉంటాయి.

ఈ అవసరాలూ తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి అనే రెండు రకాలుగా వుంటాయి. అందువల్ల మనం నేర్పించదలచుకున్న దాని పద్ధతి మారుతూ ఉంటుంది. ఈ కారణంతోనే విద్యా ప్రణాళిక కూడా ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది. అలాగే, విద్య నియమ నిబంధనలు, పద్ధతులు, ఫలితాలు కూడా నిర్ధారించటానికి విద్యావేత్త లు, మేధావులు నిరంతరం ప్రయత్ని స్తూ ఉంటారు. ఇలాంటి భావాలకు మొదట రూపకల్పన చేసిన వారు గిజూభాయ్.

గిజూభాయ్ 1885 నవంబర్ 15న జన్మించారు. జీవితాన్ని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా తన అనుభవాలను ఉపయోగించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో అమూల్య సూచనలు, సలహాలతో భారతీయ విద్యావిధానంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల తో ఎలా ఉండాలనే విషయాల్ని తెలపడమే కాకుండా వాటిని అమలు చేసి ఆదర్శంగా నిలిచారు. ఎన్నో  సముచిత మార్గాలను ఉపాధ్యాయులకు సూచించి 1939 జూన్ 23న తనువు చాలించిన మహాజ్ఞాని గిజూభాయ్.

పిల్లల మనసెరిగిన మనిషి

సులభమైన భాషలో యధార్థ విద్యా పరిస్థితులను విశ్లేషించడంలో గిజూభాయ్‌కి సాటి ఎవరూ లేరు. ఆయన ఉపాధ్యాయుల పరిమితులను, ఇబ్బందులను కూడా బాగా అర్థం చేసుకున్నారు. ఉపాధ్యాయులను బంధించి వుంచిన ఈ వ్యవస్థ క్రూరత్వం కూడా ఆయనకు బాగా తెలుసు. స్కూలు అనే ఎడారిలో పిల్లలు పడే బాధలు ఆయన తట్టుకోలేక పోయారు. వాటి నివారణకే విద్యారంగంలో కొత్త ప్రయోగాలు ఆవిష్కరించారు. పిల్లల వికాసాన్ని దగ్గరగా ఉండి చూడడానికి, సూక్ష్మంగా ఆలోచించడానికి, తాను అనుకున్న విద్యా విలువలు నిరూపించటానికి ఆయన గుజరాత్‌లోని  భావనగర్‌లో ఒక ప్రయోగశాల రూపంలో ‘దక్షిణామూర్తి బాలమందిరం’ స్థాపించారు. పిల్లల అవసరాలు, అభిరుచులు, శక్తి సామర్థ్యాలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని అక్కడ అనేక ప్రయోగాలు చేశారు. తదనంతరం వాటి సారాన్ని ‘నూతన శిక్షణ’ రూపంలో అందించారు. కొత్త దృక్పథం, కొత్త చైతన్యం, కొత్త జాగృతికి చిహ్నమైన గిజూభాయ్ జీవితం అందరికీ ఆదర్శం.

నవీన బోధనా పద్ధతులు

పుట్టినప్పటి నుండి పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి, కుటుంబం నుంచి పడే కష్టాలు, దుఃఖాలు అన్నీ ఇన్నీ కావు. పిల్లలు ఎలాంటి నేరగాళ్ళు కారు. అత్యంత అమాయకులు. అయినప్పటికీ మనం మన అజ్ఞానంతో, తెలివిలేనితనంతో మన సాధారణ మైన బలహీనతలతో, పిల్లలనే రాత్రింబవళ్ళు వేధిస్తూ వుంటాం. మాటిమాటికీ అవమానిస్తూ, కొడుతూ, తిడుతూ వారి జీవితాన్ని నరకప్రాయం చేస్తూ వుంటాం. ఒక్కసారి ఆలోచిద్దాం.. మనం చెప్పిన మాట వినలేదని మన పిల్లలను దండిస్తున్నామా లేదా? ఇది నాటి కాల పరిస్థితి. కానీ, నేడు కాలం మారింది. అలాంటి పిల్లలను రక్షించడానికన్నట్లుగా ఆవిర్భవించిన గుజరాతీ మహోపాధ్యాయుడు గిజూభాయ్ బధేకా. 

మాంటిసోరీ పద్ధతిలో నవీన బోధనకు శ్రీకారం చుట్టిన మహానుభావుడు. తల్లిదండ్రులకు, నూతన ఉపాధ్యాయులకు ఉప యోగపడే విధంగా సుమారు 17 ఉత్తమ పుస్తకాలను రచించారు. వీటిలో బాల మనస్తత్వ శాస్త్రం, వారి పెంపకం, వారి శిక్షణ, ప్రేమ పూర్వక వాత్సల్యం ఎలా అందించాలో బోధించారు. ఈ పుస్తకాలన్నింటినీ తెలుగు ప్రజలకు, ఉపాధ్యాయులకు అందడం కోసం తర్జుమా చేసి 7 సంపుటాలుగా రూపొందించి 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పాఠశాలకు ఉపాధ్యాయులకోసం పంపిణీ చేశారు. రాజల్ దేసర్ (రాజస్థాన్)లోని మాంటిసోరి బాల శిక్షణా సమితి హిందీలో ప్రచురించిన 17 భాగాల సంకలనాన్ని పాఠకుల సౌలభ్యం కోసం  7 సంపుటాలుగా ప్రచురించారు.

గిజూభాయ్ రచించిన పుస్తకాలలో ‘మాంటిసోరి పద్ధతి’, ‘పగటికల’, ‘కథా బోధనా పద్ధతి’ అత్యంత విలక్షణమైనవి. విద్యారంగంలో ఈ మూడు వుస్తకాలు చాలా మౌలికమైనవని భావిస్తారు. ఇవి గిజూభాయ్ విద్యారంగానికి ఇచ్చిన కానుకలు. తన మేధస్సును, మనస్సును పూర్తిగా మేళవించి రాయడం వల్ల వీటిని చదివిన వారు బాలల శిక్షణను పూర్తిగా అర్థం చేసుకొని, వాటిలోని అర్థాన్ని గ్రహించగలుగుతారు. ఇవి బాలల జీవితాలను లోతుగా అధ్యయనం చేయడానికి ఎంతగానో దోహదపడ తాయి. ఈ పుస్తకాలు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు తమ పిల్లలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని, శిక్షణా పద్ధతులను సమగ్రంగా అందిస్తాయని, వీటిని చదివి, ఆచరణలో పెట్టడం వల్ల తమ పిల్లలను మంచి పద్ధతిలో పెంచుతారని గిజూభాయ్ ఆశించారు. 

విద్య అంటే గిజూభాయ్ దృష్టిలో ఎంతో విస్తృతమైన అర్థం కలిగింది. ఒక వ్యక్తిత్వాన్ని రూపు దిద్దటానికి విద్యార్థిని ఎంతో సంస్కారవంతుడిగా మార్చాల్సి రావడం, అతడి వ్యక్తిత్వం అందంగా, తేజోవంతంగా మారడమే విద్య అని భావించిన మేధావి గిజూభాయ్. ఇటీవలి కాలంలోనే విద్యావేత్తలు విద్యా పద్ధతుల్లో శాస్త్రీయత వుండాలనే దిశగా ఆలోచించసాగారు. వారు అప్పటివరకు వున్న అభివృద్ధి చెందిన విద్యా పద్ధతులన్నింటినీ సమీక్షించారు. వీటితోపాటే ఎన్నోకొత్త విద్యా పద్ధతులనూ ఆవిష్కరించారు. వాటిని అమలులో పెట్టి ఎన్నో విజయాలు కూడా సాధించారు. ప్రస్తుతం విద్యారంగంలో విభిన్న బోధనా పద్ధతులు, వాటిలోని మంచి చెడులు - వీటన్నిటి గురించి ఆలోచించడానికి ఈ పుస్తకాలు ఉపయోగ పడుతున్నాయి.

సామాన్యంగా మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతాల ఆధారంగానే బోధనా పద్ధతి నిర్ణయిం పబడుతూ ఉంటుంది. అయితే, మొత్తంగానే మనస్తత్వ శాస్త్రాన్ని అనుసరించే బోధనా పద్ధతి ఉండదు. ఇందులో ఆ శాస్త్రంతోపాటు వ్యక్తిగత భావాలూ సమానంగానే ఉన్నాయి. 

మాతృ హృదయ స్పందన

ఇళ్ళలో తల్లి తన పిల్లవాడితో ఎక్కువ సమయం గడుపుతుంది. అందువల్ల ఆమే వాడికి అత్యంత సన్నిహితురాలు. తన బిడ్డను అర్థం చేసుకోవడానికి అవసరమైన  ఓర్పు, నేర్పు, శక్తి సామర్థ్యాలు తల్లిలోనే ఎక్కువగా ఉంటాయి. గిజూభాయ్ కూడా తల్లిలాంటి సూక్ష్మదృష్టితో, మమత నిండిన కళ్ళతో పిల్లలను చూచారు. వారి వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా వికసింపజేసే ప్రయత్నం చేశారు. గిజూభాయ్ రచనలన్నీ అన్ని దేశభాషలలోనూ రావలసి ఉంది. ఆ రచనలు మన దేశ బాలల శిక్షణకు దిశా నిర్దేశం చేసేవి. విద్యా సిద్ధాంతాలను, బోధనా పద్ధతులను అర్థం చేసుకోవాలంటే ఆ రచనలు చదవడం అత్యవసరం. ఇప్పటికీ ఆ పుస్తకాలు ఉపయోగకరంగానూ, సందర్భో చితంగాను ఉన్నాయి. అవన్నీ ఒక  ఉపాధ్యాయుడి అనుభవాల నుంచి, ఆ కాలం నాటి జాతీయత, మానవత్వ నేపథ్యంలో రచింపబ డ్డాయి. కావున, ఆయన జీవితాన్ని, ఆయన రచనలు చదివి ఉపాధ్యాయులు విద్యార్థితో ఎలా మసలుకోవాలో తెలుసుకొని చిన్నారులను ప్రేమతో చూసుకొని వారిని ఉత్తములుగా తయారు చేస్తారని ఆశిద్దాం.

 వ్యాసకర్త సెల్: 9963499282