- ఒడిశా టు ముంబై వయా ఖమ్మం..
- అక్రమ రవాణాకు ముఖద్వారంగా ఖమ్మం
- ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సాగు
- ఎక్సైజ్, పోలీసు శాఖల సమన్వయ లోపం
- తప్పించుకుంటున్న నిందితులు
ఖమ్మం, జూలై 3 (విజయక్రాంతి): గంజాయి సేవించి యువత పెడదారిపడుతున్నా, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నా పాలకులకు, అధికారులకు పట్టడం లేదు. స్మగ్లర్లు రైలు, రోడ్డు, జలమార్గాలను ఎంచుకుని గంజాయి రవాణా చేస్తున్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినం లేదా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడ్డ సందర్భాల్లోనే అవగాహన చర్యలు తీసుకుంటున్నారు తప్పా గంజా యి అక్రమ రవాణా నిర్మూలనకు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండేం దుకు తగు చర్యలు తీసుకోవడం లేదు. గంజాయి అక్రమ రవాణాకు ఖమ్మం ముఖ ద్వారంగా సాక్షాత్కరి స్తోంది. ఒడిశా నుంచి ముంబై వయా ఖమ్మం గంజాయి దందా సాగుతోంది.
ఇతర రాష్ట్రాలకు గంజాయి చేరాలంటే ఖమ్మం పొలిమేర లు దాటాల్సిందే. దీంతో రైల్వే శాఖలోని జీఆర్‌పీ గట్టి బందోబస్తు చర్యలు చేపడుతున్నా ఎక్సైజ్, పోలీసు అధికారుల సమన్వయ లోపంతో నిందితులు గంజాయిని రవాణా చేస్తూనే ఉన్నారు. మారుమూ ల సీలేరు, చింతూరు, మోతుగుడెం, ఒడిశా సరిహద్దు ప్రాం తాల నుంచి సినీఫక్కీలో ప్యాకేజీ గంజాయి అక్రమంగా రవాణా అవుతోంది. భద్రాచలం సరిహద్దుల్లోకి చేరగానే మధ్యదళారులు రవాణాకు ఏర్పా ట్లు చేస్తున్నారు. ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి, ఎస్కార్ట్ ఏర్పాట్లు చేసి మరీ గంజాయి స్మగ్లర్లకు దళారులు సహకరిస్తున్నారు. సారపాక కేంద్రంగా రిటైల్ అడ్డాలు వెలిశాయి.
మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన అంతరాష్ట్ర స్మగ్లర్లకు ఉమ్మడి ఖమ్మం తో పాటు వరంగల్ ప్రాంతాలకు చెందిన స్థానిక బ్రోకర్ల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లోని చిం తపల్లి సర్కిల్‌లో రైతులు ఏకంగా గంజాయి తోటల సాగు చేస్తున్నప్పటికీ అంతరాష్ట్ర సమస్యగానే నిలిచిపోతుందే తప్పితే ఎవరూ పట్టించుకోవడం లేదు. తెలంగాణ, ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో కృషి చేస్తేనే గంజాయి రవాణా అదుపులోకి వచ్చే అవకాశముంది.
కొత్తపుంతలు తొక్కుతున్న గంజాయి రవాణా
గంజాయి అక్రమ రవాణా కొత్తపుంతలు తొక్కుతోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో గంజాయి పట్టుబడుతున్నా స్మగ్లర్ల బరితెగింపుకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. పట్టుబడిన ప్రాంతాల్లోనే విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. లేదంటే చాప కింద నీరులా విద్యార్థులను టార్గెట్ చేసి చాక్లెట్‌ల రూపంలో ప్యాకెట్లు తయారు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. నిఘా వర్గాలకు సైతం అనుమానం రాకుండా తరలించడానికి వాహనాలను సినీఫక్కీలో ఏర్పాటు చేయడం చూస్తుంటే స్మగ్లర్ల నెట్‌వర్క్ ఏపాటిదో అర్థమవుతుంది.
కాగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయి రవాణా నిర్మూలనకు రైల్వే శాఖ జీఆర్‌పీ పోలీసులు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, విజయవాడ ఖమ్మం వరకు ఒక బృందం, డోర్నకల్ మరో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. తనిఖీలు ముమ్మరం చేయడంతో రైలుమార్గంలో గంజాయి రవాణాకు బ్రేకులు పడ్డా యని జీఆర్‌పీ పోలీసులు చెబుతున్నారు.
ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు
మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా యువతను, విద్యార్థులను, పౌరులను చైతన్యపరుస్తూ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ముందుగా వారం రోజుల పాటు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గంజాయి రవాణాపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ 8712671111ను ఏర్పాటు చేశారు. పోలీసు అధికారుల కధనం ప్రకారం గత ఆరేళ్లలో 204 కేసులు నమోదయ్యాయి.
పట్టుబడిన గంజాయి
ఖమ్మం నగరంలోని కొత్త బస్టాండు వెనుక భాగంలో ఉన్న ముళ్లపొదల్లో గంజాయి దాచిపెట్టిన సంఘటన తాజాగా వెలుగు చూసింది. మూడు బస్తాల్లో 39.5కిలోల గంజాయి లభ్యమైంది. దీని విలువ రూ.20 లక్షలు. మరో కేసులో ముల్కలపల్లి మండలంలో 5.8కేజీల గంజాయి పట్టుబడిం ది. పట్టుబడిన ఇద్దరు నిందితులు మైనర్లు కావడం గమనార్హం. గడిచిన ఆరేళ్లలో 265 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.11కోట్లు విలువ చేసే 9,008 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 165 మంది గంజాయి పీడితులకు సైకాలజిస్టుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించారు.