calender_icon.png 24 March, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో జనాభా కంటే ఫోన్లే ఎక్కువ!

23-03-2025 12:37:42 AM

  1. రాష్ట్రంలో వందమందికి 105 ఫోన్లు
  2. దేశ సగటు కేవలం 82 మాత్రమే
  3. ట్రాయ్ నివేదికలో వెల్లడి
  4. టవర్స్‌లో కూడా హవా
  5. రాష్ట్రంలో 30,755 టవర్స్: కేంద్ర మంత్రి
  6. గడిచిన నాలుగేండ్లలో విపరీతంగా పెరిగిన టవర్స్

న్యూఢిల్లీ, మార్చి 22: ప్రస్తుత రోజుల్లో పుట్టిన పసిబిడ్డల నుంచి పండు ముసలోళ్ల వరకు ప్రతి ఒక్కరి చేతులల్లో మొబైల్ ఫోన్ తప్పనిసరిగా కనిపిస్తోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ అందరూ మరీ ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఓటుంది. అదే మన తెలంగాణలో 100 మందికి 105 ఫోన్లు ఉన్నాయనే విషయం.

వైర్‌లెస్ టెలీడెన్సీలో మన తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. ట్రాయ్ ప్రకటించిన 2024 నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో నాలుగు కోట్లకు పైగా మొబైల్స్, 15 లక్షల మేర ల్యాండ్ ఫోన్లు ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది. మన తెలంగాణలో 100మందికి 105 ఫోన్లు ఉండగా..

దేశంలోనే గోవా తొలి స్థానంలో నిలిచింది. అక్కడ 100 మందికి 152 ఫోన్లు ఉన్నట్టు తేలింది. ఇక తర్వాత స్థానాల్లో కేరళ, హర్యానా రాష్ట్రాలు నిలిచాయి. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. 

దక్షిణాదిన మూడో స్థానం

2025లో వచ్చిన తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో రికార్డు స్థాయిలో 30,755 మొబైల్ టవర్స్ ఉన్నట్టు కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్‌సభలో వెల్లడిం చారు. 2021 మార్చి 31 వరకు తెలంగాణలో 25,097 టవర్స్ ఉండగా.. 22.54 శాతం వృద్ధితో ప్రస్తుతం ఆ సంఖ్య 30,755కు చేరుకోవడం గమనార్హం.

దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న టవర్ల సంఖ్యను చూసుకుంటే మన తెలంగాణ మూడో స్థానంలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. తమిళనాడు 50,093 టవర్లతో తొలి స్థానంలో ఉండగా.. కర్ణాటక రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో 28,803 మొబైల్ టవర్స్ ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్లు వాడే వారి సంఖ్య 78.93 శాతంగా ఉంది. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ సమాచారాన్ని వెల్లడించారు. తెలంగాణలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 3.64 కోట్లుగా ఉంది.