02-03-2025 12:22:06 AM
తెలంగాణలో ఎన్నో అద్భుతమైన గడీలున్నాయి. అలాంటివాటిలో దోమకొండ గడీ ఒకటి. పురాతన కట్టడాలు.. వారసత్వ సంపద.. అబ్బురపరిచే శిల్పకళలతో ఆకట్టుకుంటోంది ఈ గడీ. కాకతీయుల నిర్మాణాలకు తీసిపోనివిధంగా ఇందులోని కుడ్యాలు, ప్రాకారాలు, నిర్మాణాలు నేటికీ ఉట్టిపడుతున్నాయి. ఇన్ని విశేషాలున్నాయి కాబ్టటే ఈ దోమకొండ గడీ ‘యూనెస్కో’ గుర్తింపు పొందింది.
ఈ గడీ కామారెడ్డి జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గడీ కామినేని వంశస్తుల ఆధీనంలో ఉంది. 18వ శతాబ్దం నుంచి 20వ శాతబ్దం కామినేని వంశస్తులే ఈ కోటను పాలించారు. ఈ సంస్థాన పాలకులు కామినేని వంశానికి చెందిన పాకనాటి రెండ్లు. వీరికి రాజధానులుగా ఉండిన భిక్కనవోలు (పస్తుతం భిక్కనూర్) రామారెడ్డి, దోమకొండలు మూడు ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి.
చెక్కుచెదరని నిర్మాణాలు
సుమారు 39 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఈ నిర్మాణం ఉంది. ప్రాచీనకాలంలోనే ఈ గడీలో అద్భుతమైన భవనాలను నిర్మించారు. కోట లోపల ఉన్న భవనాలల్లో దర్బార్ హాల్, నాట్యశాల, అంతఃపురం, అద్దాల మేడ ముఖ్యమైనవి. అందులో అద్దాల భవనం ప్రత్యేకమైనది. ఈ మేడను 1922లో నిర్మించినట్లు శాసనం చెబుతోంది. ఈ కోటలో మహాదేవుని ఆలయం ఉంది. కోటకు తూర్పు, పడమర దిక్కుల్లో పెద్ద ద్వారాలున్నాయి. సంస్థానాధీశుల ప్రధాన నివాసమైన వెంకటభవనం రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. ఈ కోటను నిర్మించినప్పుడు చుట్టూ ఏర్పాటు చేసిన కందకం ఇప్పటికీ కనిపిస్తుంది. అయితే నిత్యం రక్షణ చర్యలు తీసుకుంటుండటం వల్ల ఈ గడీ ఇప్పటికీ చెక్కుచెదరలేదు.
నిజాం షాహీరాజులకు సామంతులు..
దోమకొండ కోట ప్రాచీన సంస్థానాల్లో ఒకటిగా ఉంది. ఆ కాలంలో నిజాం షాహీరాజులకు కామినేని వంశస్థులు సామంతులుగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. జమిందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు దోమకొండ పట్టణ కేంద్రంగా పాలన సాగించారు. దోమకొండతోపాటు భిక్కనూరు, సదాశివనగర్, రామారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని పలు గ్రామాలు వీరి ఆధీనంలో ఉండేవి. రామారెడ్డిలోని కాలభైరవ స్వామి, భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్ధరామేశ్వర స్వామి ఆలయాలు కూడా వీరి ఆధీనంలోనే ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. కామినేని వంశస్థుల పాలన సాగించిన చాలా గ్రామాలకు వీరి వారసుల పేర్లు ఉండటం విశేషం.
యునెస్కో పురస్కారం
చారిత్రక సంపదకు నిలయంగా ఉన్న దోమకొండకు అంతర్జాతీయ ఖ్యాతి సాధించింది. అద్భుత కాకతీయ శైలి శిల్ప నైపుణ్యం ఉట్టిపడే నిర్మాణాల కారణంగా ఈ గడీ పురాతన కట్టడాలు, వారసత్వ సంపద పరిరక్షణ విభాగంలో యునెస్కో అవార్డును కూడా అందుకుంది. గడీలోని శిల్పకళా సంపద, దాన్ని జాగ్రత్తగా నిర్వహించడం లాంటి అంశాల్లో యునెస్కో గుర్తింపుతో దోమకొండ పేరు స్థానిక, జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది.
కామినేని వంశస్తుల పరిరక్షణలో..
కామినేని అనిల్ కుమార్.. అపోల్ ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డి కుమార్తె శోభనను వివాహం చేసుకున్నారు. అలాగే వారి కూతురు ఉపాసన హీరో రాంచరణ్‌ను వివాహమాడారు. అయితే 2013లో ఉపాసన- వివాహ వేడుకలు కూడా ఈ గడీలో జరిగాయి. అప్పట్లో వీరి పెళ్లి కారణంనే దోమకొండకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వివాహం సందర్భంగా వారిద్దరూ కోటలోని శివాలయంలో పూజలు కూడా నిర్వహించారు. అయితే దోమకొండ కోటకు సంబంధించిన నలభై ఎకరాల ప్రహరీ ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. మిగతా భవనాలు, భూములు కామినేని వంశస్తులవని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ కోట నిర్వహణను దోమకొండ సంస్థానాధీశుడు, ఉపాసన తండ్రి కామినేని అనిల్ కుమార్ చూసుకుంటున్నారు.
గడీని కాపాడుకునేందుకు కామినేని వంశస్తులు ఆరేళ ్లక్రితం కోటకు మరమ్మతు పనులు చేపట్టారు. కోట వైభవాన్ని కాపాడే చిహ్నాలు, చిత్ర శిల్పకళలు శిథిలావస్థకు చేరుకున్న సమయంలో నాడు నిర్మించిన విధంగానే మళ్లీ ఆ కట్టడాలకు జీవంపోశారు. ఆర్కిటెక్ట్ అనురాధ నాయక్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు ఈ కోటను పరిరక్షిస్తున్నారు. అలాగే ‘దోమకొండ గడీ ట్రస్ట్’ పేరుతో ఉమాపతిరావు అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇక్కడి మహదేవుడు, హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సినిమా షూటింగ్‌లకు అనువుగానూ ఈ గడీని దీనిని తీర్చిదిద్దారు.
ఆర్చ్ నిర్మించాలి
దోమకొండ బైపాస్ చౌరస్తా 44వ జాతీయ రహదారి వద్ద దోమకొండ ఆర్చ్‌ను నిర్మిస్తే జాతీయ రహదారి వెంట ప్రయాణించే ప్రయాణికులు, టూరిస్టులకు గడీ వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. దోమకొండ గడీ పేరుతో ద్వారం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే దోమకొండను మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది.
తిర్మల్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ, దోమకొండ
-ఊ మొసర్ల శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి