calender_icon.png 19 March, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ కోసం చట్టాలున్నాయి!

09-03-2025 12:00:00 AM

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చివరకు చేయి చేసుకోవడం లాంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే మలి వయసులో మనోవేదనకు గురి చేస్తున్నారు. అందుకే పండుటాకులకు అండగా నిలిచే చట్టాలున్నాయి. అవేంటో తెలుసుకోండి. 

పండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది.

వాటి ప్రకారం ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ స్థాయి అధికారి చైర్మన్‌గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు.  

ఆస్తిని తిరిగి పొందే హక్కు

నిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. గతేడాది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్ ఇలాగే న్యాయం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 14567 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్ ఇచ్చి పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు.

వృద్ధుల హక్కులు

* ఐక్యరాజ్యసమితి 1991లో వృద్ధుల హక్కుల కోసం ప్రత్యేక తీర్మానాలు చేసింది.

* ఐక్యరాజ్య సమితిలోని అన్ని సభ్య ప్రభుత్వాలు విధిగా వృద్ధుల సంక్షేమం కోసం కొన్ని ప్రత్యేక పథకాలను రూపొందించాలి.

* వృద్ధులు సమాజంలో గౌరవంగా జీవించే హక్కులను కల్పించాలి.

* ఎలాంటి కుటుంబ, సమాజ ఒత్తిడులు లేకుండా వృద్ధులకు స్వతంత్రంగా జీవించే హక్కును కల్పించాలి.

* వృద్ధులు కుటుంబం నుంచి, ప్రభుత్వం నుంచి ఆసరా పొందే హక్కును కల్పించాలి.

* వృద్ధులు సంతృప్తిగా, ఆనందంగా జీవించే పరిస్థితులను కల్పించాలి.

ఏం చేయాలంటే?

* వృద్ధాప్యం అనేది ఒక సహజమైన జీవన ప్రక్రియ. అందువల్ల వృద్ధాప్యాన్ని తలుచుకొంటూ బాధపడటం మానేయాలి.

* పాత మిత్రులతోను, ఇరుగుపొరుగు వారితోనూ సంబంధాలను కొనసాగించడం, స్నేహాలను పెంచుకోవాలి.

* స్నేహితులను తమ ఇంటికి ఆహ్వానించడం, వారి ఇళ్లకు తరచుగా వెళ్లడం.

* కొత్త అవకాశాలకు ప్రయత్నించడం, దీని వల్ల కొత్త స్నేహితులు ఏర్పడుతారు.

* వీలైనంత వరకు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఒంటరితనం దూరం చేసి అందంగా జీవించే అవకాశం ఉంటుంది.

* రోజు వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి.

వేధిస్తే కఠిన చర్యలు 

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. వాటిపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఎవరి నుంచి ఏ విధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు. వృద్ధులను వారి సంతానం ప్రేమతో చూడాలి. వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది. 

అభాగ్యులను ఆదుకుంటూ..

అహ్మదాబాద్ వాసి పంకజ్ చిమన్‌లాల్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ గ్రూప్-2 అధికారిగా పని చేశారు. పదేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. ఆయన భార్య అంతకు ముందే మరణించారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం పంకజ్ దాదాపు రూ.30లక్షల రూపాయల దాకా పీఎఫ్ సొమ్మును అందుకున్నారు. ఆ

డబ్బుతో సమాజానికి సేవ చేయాలని భావించి, పలు ఎన్జీఓల్లో వలంటీరుగా పని చేస్తూనే ఆ సంస్థలకు ఆర్థిక సాయం అందించారు. కొన్నాళ్ల తర్వాత తానే సొంతంగా ఓ భవనాన్ని నిర్మించి 30 మంది వృద్ధులకు ఆశ్రయమిచ్చారు. అనారోగ్యంతో బాధపడేవారికి మెరుగైన వైద్యం, మందులు ఇప్పిస్తున్నారు.

అనాథాశ్రమాల్లో చదువుకునే ప్రతిభ గల ఇరవై మంది విద్యార్థుల పేరిట నెలకు మూడువేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఉపాధి లేనివారు వ్యాపారాలు పెట్టుకోవడానికీ, పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకీ ఆర్థిక సాయంగా యాభై వేల రూపాయలు అందిస్తున్నారు. ఇప్పటిదాకా రెండొందల మంది పేదలు కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పడిన పంకజ్ తనకొచ్చే పింఛన్ కూడా సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నారు.