- వయనాడ్‌లో 289కి చేరిన మృతులు
- 250 మందికిపైగా ఆచూకీ గల్లంతు
- వారంతా మట్టికిందే కప్పబడ్డారని అనుమానం
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- గుండెలను మెలిపెడుతున్న దృశ్యాలు
తిరువనంతపురం, ఆగస్టు 1: కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న పశ్చిమ కనుమల్లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య 289కి చేరింది. మూడురోజులుగా సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు సహా యక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి. భారీ కొండరాళ్లు, మట్టి, మీటర్ల లోపు బురదలో తవ్వుతున్నాకొద్ది మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఇంకా 250 మందికిపైగా కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. వారంతా మట్టికింద కప్పబడి పోయినట్టు అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాక గురువారం సందర్శించి, బాధితులను పరామర్శించారు.
కొండరాళ్లకింద నలిగి
వయనాడ్ ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచిపోవటంతో శిథిలాల కింద ఇంకా ఎవరైనా బతికి ఉన్నారేమోనన్న ఆశతో సహయక బృందాలు సోదాలను తీవ్రం చేశాయి. చాలా ఇండ్లు భారీ కొండరాళ్ల కింద నలిగిపోయాయి. దీంతో ఆ ఇండ్లల్లో ఎవరైనా బతికి ఉండొచ్చన్న ఆశతో గాలిస్తు న్నారు. అందుకోసం సైన్యం జాగిలాలను కూడా వినియోగిస్తున్నది. ఈ గాలింపులో గుండెను మెలిపెట్టే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఛిద్రమైన మృతదేహాలను చూసి వైద్యులు కూడా భయపడుతున్నారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయలేకపోతున్నారు. ‘నేను చాలా ఏండ్లుగా డాక్టర్ వృత్తిలో ఉన్నాను. ఇలాంటి దృశ్యాలను ఎప్పుడూ చూడలేదు. శరీరాలు పూర్తిగా ఛిద్రమయ్యాయ్యి. ఓ చిన్నారి శరీరాన్ని అసలు చూడలేకపోయాను. అనేక మృతదేహాలు గుర్తుపట్టేందుకు కూడా వీలు లేకుండా ఉన్నాయి. పోస్ట్‌మార్టం చేయలేక పారిపోవాలనుకొన్నా’ అని ఓ మహిళా డాక్టర్ కంటతడి పెట్టారు.
సహాయక చర్యలు ఇప్పట్లో ఆగవు
వయనాడ్‌లో సహాయక చర్యలు ఇప్పుడే ఆపేది లేదని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రకటించారు. సహాయక చర్యలపై ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అక్కడి ప్రజలందరి ఆచూకీ కనుగొనేవరకు సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
కేరళలో 50 శాతం ఇలాంటి ప్రాంతాలే
కేరళ భూభాగంలో దాదాపు 50 శాతం అత్యంత ప్రమాదరకమైన జోన్‌లోనే ఉన్నాయని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) గురువారం ప్రకటించింది. వయనాడ్ ప్రాంతంలో కొండల వాలులు 20 డిగ్రీలకు మించి ఉన్నాయని, అందువల్లనే కొండచరియలు విరిగిపడినప్పుడు తీవ్రత అధికంగా ఉంటున్నదని పేర్కొన్నది. సోమవారం విరిగిపడిన కొండ చరియలు స్థానిక నదిలో దాదాపు 8 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయినట్టు తెలిపింది.
నా తండ్రిని కోల్పోయినప్పటిలా ఉంది: రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గురువారం తన సోదరి ప్రియాంకతో కలిసి వయనాడ్ ప్రమాద స్థలిని సందర్శించారు. వివిధ క్యాంపుల్లో పునరావాసం పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాటలాడుతూ.. తన తండ్రి చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడు కూడా తనది అదే పరిస్థితి అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘నా తండ్రి చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఈ రోజు కూడా అంతటి బాధగా ఉన్నది. ఇక్కడి ప్రజలు తండ్రిని మాత్రమే కాదు.. మొత్తం కుటుంబాలనే కోల్పోయారు’ అని అన్నారు. ఇది అసాధారణ విపత్తు అని ప్రియాక గాంధీ అన్నారు. ఇక్కడి పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు శక్తికి మించి కష్టపడాల్సి ఉంటుందని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.
ఇస్రో శాటిలైట్ చిత్రాలు విడుదల
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విడుదల చేసింది. దుర్ఘటను ముందు, తర్వాత ఆ ప్రాంతం ఎలా ఉన్నదో ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. మొదటి చిత్రం లో గతంలో కొండచరియలు విరిగినపడిన ప్రాంతం ఒక పాయలాగా కనిపిస్తున్నది. రెండో చిత్రంలో ఓ కొండలోని భారీ భాగం మొత్తం కిందికి జారిపోయినట్టు స్పష్టంగా ఉన్నది.