- ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెక్నీషియన్ల కరువు
- ప్రైవేటును ఆశ్రయిస్తున్న కామారెడ్డి ప్రజలు
కామారెడ్డి, డిసెంబర్ 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ల కొరతతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు ఉన్నా వైద్య సేవలు అందక.. రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదిస్తూ జేబులు ఖాళీ చేసుకుంటు న్నారు.
పల్లె, పట్టణ దవాఖానాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు పూర్తిస్థాయిలో నియమించకపోవడంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేవారు లేక గర్భిణులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. టెక్నీషియన్ల కొరతతో స్టాఫ్ నర్సులపై అదనపు భారం పడుతోంది. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉండటంతో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఎక్కువ మంది పనిచేస్తున్నారు.
వారున్న చోట మాత్రం ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేసి నివేదికలు ఇస్తున్నారు. గుండె, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాలు, ఇతరత్రాలకు సంబంధించి రక్త నామునాలు సేకరించి జిల్లా కేంద్రానికి పంపిస్తున్నారు.
పోస్టుల భర్తీకి నివేదికలు
జిల్లాలో 20 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, 2 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, నాలుగు బస్తీ దవాఖానలు ఉన్నాయి. వీటితో పాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, బాన్సువాడ, ఎల్లారెడ్డిలోని 100 పడకల ఆసుపత్రి ఉన్నాయి. దోమకొండ, బిచ్కుదం, పిట్లం, మద్నూర్‌లోని 30 పడకల క్లస్టర్ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్ అవసరం కాగా కేవలం ఒక్కరు మాత్రం విధులు నిర్వహించగా మిగతా పోస్టులు ఖాళీ ఉన్నాయి.
30 పడకలతో పాటు 100 పడకల ఆసుపత్రుల్లో నలుగురు, ఆయా ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టుల ఖాళీలపై ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. పోస్టుల భర్తీపై ఇటీవల ప్రభుత్వం రాత పరీక్షలు నిర్వహించిందని త్వరలోనే నూతన టెక్నీషియన్లను విధుల్లోకి వస్తారని వైద్యాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఓపీ పెరిగింది
గతంతో పోలిస్తే ప్రస్తుతం రోగుల సంఖ్య రెండింతలు పెరిగింది. గతంలో ఇక్కడ 150 నుంచి 200 వరకు ఓపీ ఉండేది. ప్రస్తుతం రోజుకు ఓపీ 400 వరకు పెరిగింది. సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఖచ్చితంగా టెస్టులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 30 పడకల ఆసు పత్రిలో గతంలో ఇద్దరు కాంట్రాక్ట్ పద్ధతిలో ల్యాబ్ టెక్నీషియన్లు ఉండేవారు. ప్రస్తుతం రెగ్యులర్ పోస్టు రాగా, వారిని తొలగించారు. దీంతో ఇబ్బందిగా ఉంది.
వెంకటేశ్వర్లు, ఆసుపత్రి
సూపరిండెంట్, దోమకొండ