బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ చిత్రానికి ఇంకా సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ జారీ కాలేదు. ఇదే విష యమై తాజాగా కంగన మాట్లాడుతూ.. “త్వరలోనే మా సినిమా సెన్సార్ పూర్తవుతుందని ఆశిస్తున్నా. మేం సర్టిఫికెట్ కోసం వెళ్లిన రోజు కొంత మంది డ్రామా క్రియేట్ చేశారు. సెన్సార్ బోర్డులోనూ చాలా సమస్యలున్నాయి.
అనుకున్న సమయానికి మా సినిమా విడుదల కావాలని కోరుకుంటున్నా. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నా. కానీ, వాళ్లు ఇవ్వడంలేదు. నా సినిమా కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇందుకోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా’ అని తెలిపింది. మరోవైపు ఈ సినిమా విషయంలో చిత్రబృందానికి వస్తున్న బెదిరింపులను ఉద్దేశిస్తూ కంగన ‘మమ్మల్ని బెదిరించినంత మాత్రాన చరిత్ర ఏమీ మారిపోదు’ అని కామెంట్ చేశారు.