calender_icon.png 25 October, 2024 | 3:58 AM

అప్పుడు వంచన.. ఇప్పుడు ఖూనిరాగాలు

25-10-2024 01:44:23 AM

  1. అన్నదాతలకు అన్యాయం చేసిందే బీఆర్‌ఎస్
  2. కేటీఆర్ ఆటలను అన్నదాతలు సాగనివ్వరు
  3. పంచాయతీరాజ్ శాఖమంత్రి సీతక్క

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): అధికారం కోల్పోయామన్న అక్కసుతో మాజీమంత్రి కేటీఆర్ దూషణలకు దిగితే సహించేది లేదని, తగిన రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని మంత్రి సీతక్క గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆదిలాబాద్‌లోని రామ్‌లీలా మైదానంలో సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఖండించారు.

ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే కేటీఆర్ పని అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఆటలను అన్నదాతలు సాగనివ్వరని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పడు అన్నదాతలను వంచించి.. ఇప్పుడు ఖూనీ రాగాలు తీస్తున్నారని మండిపడ్డారు. ఏకకాలంలో పంట రుణమాఫీ చేయలేని అసమర్థ బీఆర్‌ఎస్‌ను గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు తరిమికొట్టినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు.

గతంలో విడతల వారీగా చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోక రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయలేదని, ఫలితంగా 61.5 శాతం మంది రైతులకు ప్రైవేట్ రుణాలు దిక్కైనట్టు మీ ప్రభుత్వమే తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదికలో ఒప్పుకుందని గుర్తుచేశారు. కానీ తమ ప్రభుత్వం రూ.18 వేల కోట్లను మాఫీ చేసి 23 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసిందని గుర్తు చేశారు.