calender_icon.png 28 September, 2024 | 6:57 PM

అప్పుడు నంబర్లు.. ఇప్పుడు నోటీసులు

27-09-2024 12:10:52 AM

  1. ప్రభుత్వ భూమిలో అక్రమంగా షెడ్లు
  2. నాయకుల అండతో ఇంటి నంబర్లు
  3. నేడు డాక్యుమెంట్లతో రావాలని నోటీసులు

మంచిర్యాల, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన వారికి మున్సిపాలిటీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో లబోదిబోమంటున్నారు. గతంలో చెన్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ. పెరుగుతున్న జనాభా దృష్ట్యా అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీగా మార్చారు.

మున్సిపాలిటీగా మారిన తర్వాత పట్టణంలోని గెర్రె కాలనీలో 840 సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమిలో కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా వెంచర్లు చేసి, అమాయక ప్రజలను మోసం చేసి లక్షలు దండుకున్నారు. ఇప్పుడు తమకేం పట్టదన్నట్టు ముఖం చాటేస్తున్నారు. షెడ్లు వేసి ఆక్రమించుకొని ఇంటి నంబర్లు తీసుకున్నారు. మరోవైపు అధికారులకు మామూళ్లు ఇచ్చి ఓపెన్ ప్లాట్లకు సైతం ఇంటి నంబర్లను కేటాయించుకున్నారు. 

ఇంటి నంబర్లు కేటాయింపు.. తొలగింపు

షెడ్లు నిర్మించుకున్న అమాయకుల నుంచి డాక్యుమెంట్లు లేకున్నా ఇంటి నంబర్‌లు ఇప్పిస్తామని కొంతమంది మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులు డబ్బు వసూలు చేశారు. రాత్రికి రాత్రే ఈ వెంచర్లలో షెడ్లు నిర్మించుకున్న వారందరికీ ఇంటి నంబర్లు సైతం ఇచ్చారు. ఈ విషయంపై పలువురు ప్రశ్నించినా, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా లంచాలు తీసుకున్న అధికారులు, నాయకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. రెండేండ్ల క్రితం కిష్టంపేట గ్రామ పంచాయతీలో గల ప్రధాన రహదారికి ఆనుకొని నిర్మించిన 50 ఇండ్లను అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారు.

అదే సమయంలో గెర్రె కాలనీలో అక్రమంగా నిర్మించిన ఇండ్లను కూల్చకపోవడంపై పలు విమర్శలు రాగా ప్రభుత్వం మారడం అందరి దృష్టి ఈ భూములపై పడింది. ఓపెన్ ప్లాట్లకు ఇంటి నంబర్లు ఎలా ఇచ్చారని అధికారులను నిలదీయడంతో ఇటీవలే ఆన్‌లైన్ నుంచి మున్సిపల్ అధికారులు తొలగించారు. తాజాగా గురువారం భవనాలు, షెడ్లు నిర్మించుకున్న వారంతా సంబంధిత డాక్యుమెంట్లతో రావాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో అక్రమార్కులందరి గుండెల్లో గుబులు రేకిత్తింది.

ఇల్లు కూల్చితే చావే శరణ్యం 

మాది ముత్తెరావుపల్లి. నేను డబ్బులు పెట్టి ఈ ప్లాటు కొనుక్కున్న. నాకు ఆరోగ్యం బాగాలే కపోవడంతో ఊళ్ల ఉన్న మూడు ఎకరాలు అమ్మి ఇక్కడ ఇల్లు కట్టుకున్న. ఆసుపత్రి దగ్గరుందని ఇక్కడే ఉంటున్నం. ఇల్లు కట్టేటప్పుడు ఆపినా ఇక్కడికి రాకపోదుం. అప్పు డు ఇంటి నంబరు ఇచ్చిండ్రు, కరెం టు మీటరు ఇచ్చిండ్రు. ఇప్పుడేమో పేపర్లు తెమ్మంటే ఎక్కడికి పోవాలి. మున్సిపాలిటీ  అధికారులు ఇవ్వాళ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చి పోయిండ్రు. నా ఇంటిని కూల్చివేసే ముందు పురుగుల మందు తెచ్చి కూల్చుండ్రి. ఇంటిని కూల్చితే నాకు మిగిలేది చావే.

 వెన్నపురెడ్డి కిట్టక్క, దివ్యాంగురాలు, చెన్నూర్