హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): సులువుగా డబ్బు సంపాదించేందుకు ప్రైవేట్ హాస్టళ్లలో ల్యాప్‌టాప్‌ల చోరీలకు పాల్పడుతున్న నిందితుడితోపాటు ఇద్దరు కొనుగోలుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఆర్‌నగర్ ఏసీపీ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన బండ్లమూడి చిన్న అవులయ్య(30) ఎస్సార్‌నగర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోని పలు కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు.
వచ్చే జీతం సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు ల్యాప్‌టాప్‌లు చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. ఎస్సార్‌నగర్‌తో పాటు పక్కనే ఉన్న ప్రాంతాల్లోని ప్రైవేట్ హాస్టళ్లలో ల్యాప్‌టాప్‌లు చోరీ చేసి అమ్మడం ప్రారంభించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు చిన్న అవులయ్యతో పాటు కొనుగోలు దారులు వెంకటక్రిష్ణ, వెంకటేశ్వర్లను శుక్రవారం ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం 9 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.