* తప్పతాగి నిద్రపోయాడు
నార్సింగి (మెదక్), డిసెంబర్ 30: ఓ మద్యం దుకాణంలో చోరీ చేయడానికి వచ్చిన దొంగ పూటుగా తాగి షాప్‌లోనే పడిపోగా.. తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసిన ఘటన మెదక్ జిల్లా నార్సింగిలో జరిగింది. స్థానిక కనకదుర్గ వైన్ దుకాణంలో ఆదివారం రాత్రి ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు.
కౌంటర్‌లో ఉన్న నగదు, మద్యం బాటిళ్లను ఓ సంచిలో వేసుకొని అక్కడే ఉన్న మద్యం సేవించాడు. మత్తులోనే అక్కడే నిద్రపోయాడు. సోమవారం వైన్స్ యజమాని షాపు తెరిచి చూడగా మద్యం మత్తులో పడిపోయిన దొంగ కనిపించాడు. దీంతో అతడు నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.