16-02-2025 12:06:18 PM
అశ్వరావుపేట, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని తిరుమల కుంట కాలనీ సమీపంలో గల సమ్మక్క సారలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న పట్టు చీరలు అమ్మవారి అలంకరణకు సంబంధించిన ఆభరణాలను అపహరించారు. ఉదయం ఆలయ అర్చకులు ఆలయానికి రాగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ 70 వేల విలువగల సొమ్ము అపహ రించబడినట్టు ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్ బొగ్గల వెంకటేశ్వరరావు తెలిపారు. ఆలయ నిర్వహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వరావు పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.