కామారెడ్డి,(విజయక్రాంతి): తాళం వేసిన ఇంటి తలుపులు పగులకొట్టి బంగారం, వెండి నగదు ఎత్తుకెళ్లిన ఘటన కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన నిమ్మ రాజశేఖర్రెడ్డి మాఘ అమవాస్య సందర్భంగా కూడెల్లి వెళ్లడానికి అక్కద దగ్గరికి గర్గుల్కు బుధవారం మధ్యాహ్నం వెళ్లాడు. తిరిగి గురువారం ఇంటికి వచ్చేసరికి తలుపు పగులగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా సామాన్లు అన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. క్లూస్ టీం సభ్యులు వచ్చి వివరాలు సేకరించారు. రూ.30 వేల నగదు, బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, 10 తులాల వెండి పోయినట్లు బాధితులు తెలిపారు. సీసీ కెమారా వివరాలు దొరక్కుండా హార్డిస్క్ కూడా ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.