రాజేంద్రనగర్,(విజయక్రాంతి): రాజేంద్రనగర్ లో గురువారం దొంగలు రెచ్చిపోయారు. వరుసగా నాలుగు ఇళ్లలో పంజా విసిరారు. బంగారం, నగదు అపహరించిన ఘటన నార్సింగి పీఎస్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షాకోట్ శాంతినగర్‌లో నాలుగు ఇళ్లు వరుసగా ఉన్నాయి. అయితే, ఆయా ఇళ్ల యజమానులు శుభకార్యాలు, తిరుపతి తదితర దైవదర్శనాలకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు తమ చోర కళకు పనిచెప్పారు. ఆయా ఇళ్ల తలుపుల తాళాలు ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు. బీరువాలు ధ్వంసం చేసి బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదును అపహరించారు. శుక్రవారం విషయం తెలుసుకున్న బాధితులు నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎంతమేర సొత్తు చోరికి గురైంది అనే వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.