calender_icon.png 25 February, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రి ఆస్తి కోసం పథకం ప్రకారం దొంగతనం...

25-02-2025 09:07:01 PM

70 తులాల బంగారం, 1.5 లక్షల నగదు స్వాధీనం..

24 గంటల్లో కేసును చేదించిన పోలీసులు...

హుజురాబాద్ (విజయక్రాంతి): హుజురాబాద్ లోని ప్రతాపవాడకు చెందిన ప్రతాప రాఘవరెడ్డి ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి 70 తులాల బంగారంతో పాటు ఏడు లక్షలు నగదు దోచుకెళ్లిన విషయం విధితమే. ఈ భారీ దొంగతనంలో పోలీస్ విచారణలో నివ్వరపోయే నిజాలు బయటపడ్డాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ జి మాట్లాడుతూ... కన్న కొడుకే తండ్రి ఆస్తి కోసం పథకం ప్రకారం దొంగతనం చేయించాడని పోలీస్ విచారణలో తేలిందని అన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాఘవరెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారని వారిలో పెద్ద కుమారుడు నాగరాజు, అతని భార్యశాలిని కలిసి తండ్రి వద్ద ఉన్న బంగారు నగలు, నగదు కాజేసేందుకే కుట్ర పన్ని తాను నిర్వహించే హోటల్లో పనిచేసే అమీర్ సాయం కోరాడు.

అమీర్ కూడా అంగీకరించడంతో ఒక పథకాన్ని అమలు చేయాలనుకున్నారు. అమీర్ కు బంధువైన వరంగల్ జిల్లా మల్కాపూర్ కు చెందిన సమీర్ ని ఈ దొంగతనం చేయాలని కోరడంతో సమీర్ కూడా సరే అని చెప్పి సమీర్ స్నేహితులైన మున్నా, కృష్ణ లను కలుపుకొని ఒప్పందం కుదుర్చుకున్నాడు . ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నాగరాజు నిర్వహించే హోటల్ కి సమీర్, మున్నా, కృష్ణ కలుసుకున్నారు. హోటల్లోనే దొంగతనం గురించి చర్చించుకుని సుపారి మాట్లాడుకున్నారు. అదే సమయంలో మద్యం తాగేందుకు నాగరాజు అమీర్ కు డబ్బులు మద్యం తీసుకురమ్మని చెప్పగా అమీర్ వెళ్లి తీసుకువచ్చాడు. మద్యం తాగిన అనంతరం పథకం ప్రకారమే ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో నాగరాజు ఉండే ఇంటిపైకి నలుగురు చేరుకున్నారు. 

తనపై ఎలాంటి అనుమానం రాకూడదని నాగరాజు కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పడుకున్నాడు. అంతా నిద్రిస్తున్న సమయంలో మరికొంత మద్యం కావాలని చెప్పడంతో అమీర్ మద్యం తీసుకువచ్చేందుకు బయటకు వెళ్తున్న సమయంలో ముందుగానే అనుకున్న విధంగా రాఘవ రెడ్డి ఇంటి ముందు ఉన్న మోటార్ ఆన్ చేసి వెళ్ళాడు. మోటర్ ఆఫ్ చేయడానికి రాఘవరెడ్డి ఇంట్లో నుంచి ఎవరైనా బయటకు వస్తే దాడికి పాల్పడవచ్చని పన్నాగం పన్నారు. వారు ఊహించినట్లే రాఘవరెడ్డి ఇంట్లో నుంచి వారి సతీమణి మోటర్ ఆఫ్ చేయడానికి తలుపు తీసి బయటకు వచ్చింది. అక్కడే మాటు వేసి ఉన్న ముగ్గురు దుండగులు వెంటనే ఆమెపై దాడి చేసి ఇంట్లోకి చొరబడ్డారు. రాఘవ రెడ్డి తో పాటు భార్య వినోద వారి కూతురు మానసలపై దాడి చేశారు. రాఘవరెడ్డి, వినోదలపై కత్తులతో దాడి చేసి వారి వద్ద ఉన్న 70 తులాల బంగారం తో పాటు లక్ష 50 వేల రూపాయల నగదు పట్టుకొని పారిపోయారు.

విషయం తెలుసుకున్న హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ రంగంలోకి దిగి పలుకోనాల్లో విచారణ జరిపారు. కరీంనగర్ నుంచి డాగ్ స్వాడ్ తో పాటు క్లూస్ టీం తో వివరాలు సేకరించారు. అనంతరం మూడు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఏ చిన్న ఆధారాన్ని కూడా వదిలిపెట్టకుండా క్షుణ్ణంగా  పరిశీలించి చివరికి రాఘవరెడ్డి తనయుడు నాగరాజు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని నిర్ధారణకు వచ్చి అతని అదుపులో తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. దొంగతనం ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హుజురాబాద్ పోలీసులు 24 గంటల్లోనే నిందితులను పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంత త్వరగా సమస్యను పరిష్కరించినందుకు హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి తో పాటు టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, ఎస్సై మహమ్మద్ యూనస్ అలీ, సిసిఎస్ టీం సిబ్బంది సురేందర్ పాల్, సాయి, అవినాష్, టెక్ టీం సిబ్బంది ప్రదీప్, సంతోష్ తో పాటు పోలీస్ సిబ్బందిని అభినందించారు.