25-02-2025 02:24:21 AM
హుజురాబాద్‌లో దుండగుల బీభత్సం
హుజురాబాద్, ఫిబ్రవరి 24: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ప్రతాపవాడలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు రాఘవరెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. ప్రతాప రాఘవరెడ్డితోపాటు అతని భార్య వినోదపై కత్తులతో దాడి చేశారు. కూతురి మెడపై కత్తులు పెట్టి బెదిరించి ఇంట్లోని బీరువాలో ఉన్న 80తులాల బంగారు ఆభరణాలు, రూ.7 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫోన్లను తీసుకెళ్లి బయటపడేశారు.
సమాచారం తెలుసుకున్న సీఐ తిరుమల్‌గౌడ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. సుమారు గంటపాటు దొంగలు ఇంట్లో ఉండి నానా బీభత్సం సృష్టించి పెద్ద ఎత్తున బంగారం నగదు ఎత్తుకొని వెళ్లడమే కాక ముగ్గురిపై కత్తులతో దాడి చేసి గాయపరచడం పట్టణంలో సంచలనంగా మారింది.
అయితే రాఘవరెడ్డి కూతురు గత ఐదు రోజుల క్రితమే అమెరికా నుండి పుట్టింటికి రాగా ఆమె ఒంటిపై ఉన్న బంగారం, ఆమె వెంట తెచ్చుకున్న నగదును గుర్తించిన తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. దొంగలు ఇంటి వెనక నుండి ఇంట్లోకి చొరబడి నీళ్ల మోటర్ ను ఆన్ చేసి చుట్టుపక్కల నల్లాలు విప్పి పడుకున్న వారికి మెలుకువచ్చే విధంగా చేసి తలుపు తీసి చూసే క్రమంలో ఇంట్లోకి చొచ్చుకొని లోపలికి వెళ్లి ఈ చోరికి పాల్పడటం చూస్తుంటే పథకం ప్రకారం చేసినట్లుగా తెలుస్తున్నది.