12-03-2025 12:37:43 AM
చోరీకి పాల్పడిన నిందితులు అరెస్ట్
కుత్బుల్లాపూర్, మార్చ్ 11(విజయక్రాంతి):కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ లో ఉన్న శ్రీ రామలింగేశ్వర శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇద్దరు దుండగులు ఆలయంలోకి ప్రవేశించి శివాలయంలో ఉన్న ఆభరణాలు దొంగలించారు. చోరీకి పాల్పడిన వ్యక్తులు చోరీ చేసే క్రమంలో శివలింగంపై కాళ్లు పెట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి నిర్ణయించుకున్నాయి. చోరీకి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం 8 గంటలకు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఈ క్రమంలో జీడిమెట్ల పోలీసులు మంగళవారం ఉదయం 7:30 గంటల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుల వివరాలను బాలానగర్ డిసిపి కే. సురేష్ కుమార్ వెల్లడించారు.చోరీకి పాల్పడిన నిందితులులలో ఒకరు లంగర్ హౌస్ మరొకరు టోలిచౌకి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు.వీరిపై గతంలో కేసు కూడా నమోదు అయ్యిందని, గంజా మత్తు పదార్థాలకు అలవాటు పడిన వీరు గాంధీనగర్ శివాలయంలో చోరీకి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి 95 వేల రూపాయలు విలువ గల దేవుని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
అరెస్టు చేసిన నిందితుల విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలలో నిందితుల పేర్లు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నిస్తున్నారు. నిందితులు ఓ వర్గానికి చెందినవారు కావడంతో పాటు, రంజాన్ మాసం కావడంతో సమస్యలు రావచ్చనే ఉద్దేశంతోనే పేర్లు వెల్లడించలేదని తెలుస్తుంది.కాగా ఆలయంలో చోరీకి పాల్పడిన ఘటనపై హిందూ సంఘాలు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తు చర్యలో భాగంగా పలువురుని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లకు తరలించారు.గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఆభరణాలను రికవరీ చేసిన జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కనకయ్య, ఎస్త్స్ర శ్యాంబాబు, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్, కానిస్టేబుల్ రవి నాయక్ లను డీసీపీ అభినందించారు.