calender_icon.png 23 September, 2024 | 1:59 PM

అంసతృప్తిలో కశ్మీర్ యువత!

22-09-2024 12:08:34 AM

  1. ఆర్టికల్ 370 రద్దుతో అన్ని కోల్పోయామని వేదన
  2. ఉద్యోగాలు, భూములు దక్కట్లేవని ఆరోపణలు
  3. సొంత ప్రభుత్వమే రావాలని ఆకాంక్షిస్తున్న యువత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిసారి అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడుతలో భాగంగా 24 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ప్రజలు బారు లు తీరి మరి ఎన్నికల ప్రక్రియలో భాగమయ్యారు. కశ్మీర్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. అక్కడి యువకులు తమకు అవకాశాలు లభించడం లేదనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్టికల్ 370తో ఉద్యోగాలు, భూమి తమకే రిజర్వ్‌గా ఉండేవని చెబుతున్నారు. ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో ఇతరులు ఉద్యోగం చేయడానికి, ఆస్తులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఇచ్చారని.. ఫలితంగా తమ అవకాశాలు చేజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఓటింగ్ శాతం పెరగడానికి కారణమని తెలుస్తోంది. 

టాపర్లకూ ఉద్యోగాలు రాలేదు

కశ్మీర్ వర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అమీర్ నజీర్ (29).. గందేర్‌బల్ గ్యారేజీ ప్రాంతంలోని హైవేపై టీ, స్నాక్స్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఇక్కడ రద్దీ ఉండ టంతో అతని వ్యాపారం బాగానే నడుస్తోంది. కానీ, తాను చేయాలనుకున్న పని ఇది కాదని చెబుతున్నాడు. నేను యావరేజ్ విద్యార్థిని. నా బ్యాచ్‌లో టాపర్లు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకహోదా ముసుగులో 2024 ఎన్నికలు ముగుస్తాయి. కానీ మా జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిం ది. ఆర్టికల్ 370 ఉన్నప్పుడు మా ఉద్యోగాలు, భూమి మాకే ఉండేవి. ఇది నా తరానికి చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతా మారింది అని పేర్కొన్నాడు. 

మా ఉద్యోగాలు వాళ్ల చేతుల్లోకి..

కశ్మీర్‌వ్యాప్తంగా ఆర్టికల్ 370 రద్దుపై ఆగ్రహంతో తండోపతండాలుగా ప్రజలు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. అయితే అనంత్‌నాగ్ నుంచి శ్రీనగర్ వరకు ఉద్యోగాలు, ఆదాయ మార్గాల అన్వేషణలో యువత సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తోంది. ఢిల్లీకి చెంది న గ్రాడ్యుయేట్లతో తాము పోటీ పడలేమని స్థానిక యువత భావిస్తున్నారు. ఐదేళ్లుగా ఆర్టికల్ 370ని పక్కనబెట్టారని, కానీ కశ్మీర్‌లోని హైవేలు, నగరాలు, పట్టణాల్లో హిమాచల్, జార్ఖండ్ తరహాలో ఉద్యోగాలు, భూమికి రక్షణ ఉందని చెప్పుకునేవారికి కొరత లేదని అమీర్ వివరించాడు.

తమ ప్రాంతంలో తమ ఎమ్మెల్యే, సొంత ప్రభుత్వం ఉంటే పరిస్థితులు వేరే విధంగా ఉండేవని తెలిపాడు. ఈ అసంతృప్తి ప్రజల్లో ఉంది కాబట్టే సొంత ప్రభు త్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని చెప్పాడు. ప్రత్యేక హోదా లేకుండా కశ్మీర్ సాంస్కృతిక ఉనికిపై చాలామందికి తీవ్ర ఆందోళనలు ఉన్నట్లు అమీర్ తెలిపాడు.