- కారుతో ఢీకొట్టి.. వేట కొడవలితో కిరాతకంగా దాడి
- కులాంతర వివాహం.. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే హత్య
- పోలీసుల అదుపులో నిందితుడు
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 2: తోబుట్టువును కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సోదరుడు ఆమెకు వారసత్వంగా దక్కాల్సిన భూమిపై కన్నేశాడు. ఆమె ఆస్తి రాసిచ్చినా సోదరుడు సంతృప్తి చెందలేదు. భవిష్యత్తులో ఆమె నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావించాడు.
ఇటీవల ఆమె కులాంతర వివాహం చేసుకోవడంతో కోపంతో ఊగిపోయాడు. చివరకు సోదరిని మట్టుపెట్టేమందుకు పథకం రచించాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న సోదరిని కారుతో బలంగా ఢీకొట్టాడు. కిందపడి గాయాలపాలైందనే కనికరం లేకుండా, వేట కొడవలితో పాశవికంగా దాడి చేసి హతమార్చాడు. ఈ హృదయ విదారకమైన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో జరిగింది.
సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రాయపోల్‌కు చెందిన కొంగర నాగమణి (27) ఇదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఎనిమిదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. 2021లో నాగమణి కానిస్టేబుల్ కొలువు సాధించింది. కొన్నేళ్ల క్రితం ఆమెకు మరో వ్యక్తితో వివాహమైంది. కొన్నికారణాలతో ఏడాది క్రితం భర్త నుంచి ఆమె విడాకులు తీసుకున్నది.
ప్రస్తుతం ఆమె హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శ్రీకాంత్, నాగమణి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారం లేకుండా గత నెల 10న యాదగిరిగుట్టలో ప్రేమికులు వివాహం చేసుకున్నారు. వారిది కులాంతర వివాహం కావడంతో ఆమె సోదరుడు పరమేశ్ కోపం పెంచుకున్నాడు.
అక్కాతమ్ముళ్ల మధ్య ఆస్తి తగాదాలు కూడా ఉండడంతో ఆమెను హతమార్చేందుకు పరమశ్ పథకం పన్నాడు. నాగమణి, శ్రీకాంత్ దంపతులు ఆదివారం స్వగ్రామానికి వెళ్లారు. సోమవారం ఉదయం ఆమె విధులకు హాజరయ్యేందుకు రాయపోల్ గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్నది. ఈ క్రమంలో పరమేశ్ కారులో ద్విచక్రవాహనాన్ని వెంబడిస్తూ వస్తూ మన్నెగూడ సమీపంలో వేగంగా ఢీకొట్టాడు.
ఘటనలో ద్విచక్రవాహం కిందపడి నాగమణి గాయాల పాలైంది. పరమేశ్ కారును ఆపి, దిగి వేట కొడవలితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాగమణి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు పరమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు భర్య హత్యపై శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. పోలీసులు న్యాయం జరి గేలా చూస్తామని శ్రీకాంత్‌కు సర్దిచెప్పారు.
భూమి విషయంలో గొడవ..
కులాంతర వివాహం, ఆస్తి తగాదాల నేపథ్యంలోనే నాగమణిని ఆమె సోదరుడు హతమార్చాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. నాగమణికి వారసత్వంగా సంక్రమించిన ఎకరా భూమిపై పరమేశ్ కన్ను వేశాడని, ఈ విషయంలో ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే పరమేశ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారని, నాగమణి ఆ ఎకరా భూమిని సైతం సోదరుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేసిందని, అయినప్పటికీ పరమేశ్ ఆమెను వదిలిపెట్టలేదని సమాచారం.
భవిష్యత్తులో ఎలాంటి గొడవ చేయనని, కోర్డులో దావా వేయొద్దని సోదరుడు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని సోదరిపై ఒత్తిడి తెచ్చాడని తెలిసింది. ఈ క్రమంలో నాగమణి ఎదురు తిరగడం ప్రారంభించింది. ‘తల్లిదండ్రుల ఆస్తిలో నీకు ఎంత హక్కు ఉంటుందో.. నాక్కూడా అంతే హక్కు ఉంటుంది.
అవసరమైతే నేను కోర్టుకు వెళ్లి, నా ఆస్తిని రాబట్టుకుం’ అని నాగమణి తేల్లిచెప్పిందని తెలిసింది. ఈ వివాదంతో పాటు ఇటీవల ఆమె కులాంతర వివాహం చేసుకోవడంతో పరమేశ్ మరింత కోపం పెంచుకుని, హత్యకు పాల్పడ్డాడని సమాచారం.
నాకూ ప్రాణహాని ఉంది..
తన భార్య హత్యపై మృతురాలి భర్త శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. నాగమణి తానూ ఎనిమిదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని.. ఆమె కానిస్టేబుల్ కొలువు సాధించేందుకు ఎంతో సహకరించానని తెలిపాడు. ఇటీవల తాము వివాహం చేసుకున్నామని, ఈ సందర్భంలో తమకు ప్రాణహాని ఉందని ఇబ్రహీంపట్నం పోలీసులను సైతం ఆశ్రయించామని స్పష్టం చేశారు.
సోమవారం రాయపోల్ నుంచి బయల్దేరే ముందే నాగమణి తనకు నాకు ఫోన్ చేసిందని, తమ్ముడు పరమేశ్ తనపై దాడి చేస్తున్నాడని చెప్పిందన్నాడు. తమ కులాంతర వివాహం పరమేశ్‌కు నచ్చలేదని, నాగమణికి చెందాల్సిన భూమి ఇవ్వనని పరమేశ్ ఎన్నోసార్లు అన్నాడని తెలిపాడు.
నాగమణిని హత్య చేస్తానని పరమేశ్ కొద్దిరోజులుగా బెదిరిస్తున్నాడని, బెదిరింపులపై తాము ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను సైతం ఆశ్రయించామన్నాడు.
మృతురాలి భర్త శ్రీకాంత్