calender_icon.png 24 October, 2024 | 7:45 AM

అన్నను చంపించిన తమ్ముడు

24-10-2024 01:16:13 AM

  1. భూ తగాదాలే కారణం
  2. కేసును ఛేదించిన పోలీసులు
  3. ఐదుగురు నిందితుల అరెస్ట్
  4. డీఎస్పీ రాజశేఖర్‌రాజు వెల్లడి

నల్లగొండ, అక్టోబర్ 23 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం నారాయణపురంలో ఈ నెల 21న జరిగిన వృద్ధుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూ తగాదాల నేపథ్యంలో సొంత తమ్ముడే సుపారీ ఇచ్చి అన్నను హత్య చేయించినట్టు పోలీసులు గుర్తించారు.

హత్యకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిర్యాలగూడలోని తన కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన కాకునూరి నర్సింహులుకు లింగయ్య, కొండయ్య, శ్రీను ముగ్గురు కుమారులు.

పెద్ద కుమారుడు లింగయ్య పేరిట ఆరు ఎకరాల భూమి ఉంది. లింగయ్య అవివాహితుడు.. కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. దీంతో తనవాటాతోపాటు రెండో అన్న కొండయ్యకు రావాల్సిన భూమిని సైతం తమ్ముడు శ్రీను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తన వాటా భూమి ని తనకు రిజిస్ట్రేషన్ చేయాలని కొండయ్య పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టాడు.

భూమి ఇవ్వడం ఇష్టం లేక అన్నపై కక్ష పెంచుకున్న శ్రీను అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. వేముల నాగ రాజు, పందిరి లింగస్వామి, చీరాల సురేశ్, జిట్టబోయిన వెంకన్నకు రూ.5 లక్షల సుపారీ ఇచ్చి ఈ నెల 16న దారుణంగా హత్య చేయించాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు శ్రీనును విచారించగా హత్యకు కారణాలు వెలుగులోకి వచ్చాయి.