‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది..’ అనే డైలాగ్ విన్న వెంటనే అందరికీ పవన్ కల్యాణ్ గుర్తొస్తారు. కానీ సినీ అభిమానులకు మాత్రం ఆ మాటలు రాసిన చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ తీరును గుర్తు చేసుకుంటారు. నిజ జీవితంలో తాను కలిసిన వ్యక్తులు, చదివిన పుస్తకాలు, చూసిన సంఘటనలు, అనుభవాలు, అనుభూతుల సమాహారమే నా సినిమా అని చెప్తుంటారాయన. ఆయన చెప్పినట్టే సభ్య సమాజంలో చాలా మందిని చూస్తున్నట్టుగా అనిపించే డైలాగ్స్ ఎన్నో ఆయన చిత్రాల ద్వారా జనబాహుళ్యంలోకి వచ్చాయి.
నాన్న కూచిగా పుస్తకాలతో దోస్తీ చేస్తూ సాహిత్యం పట్ల తాను ఆకర్షితుడయ్యాడని చెప్పడానికి ఆయన సినిమాల్లోని పాటలే చెప్తుంటాయి. తన సినిమాల్లో గీత సాహిత్యం అంత గొప్పగా ఉండటం వెనుక దాగి ఉన్న మర్మాన్నీ, తన కెరీర్ గురించి ‘విజయక్రాంతి’తో పంచుకున్నారు.. ఈ ‘సండే స్పెషల్’ విశేషాలు ఆయన మాటల్లోనే...
మాది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ధర్మపురి. కానీ, హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈల్ టౌన్‌లో పెరిగాను. నాన్న తెలుగు ఉపాధ్యాయుడిగా ఈ మహా నగరంలో ఉద్యోగ జీవితం ప్రారంభించడమే ఇందుకు కారణం. నేను సినిమాల వైపు రావడానికి ప్రోత్సహించిన వారిలోనూ ఆయన పేరే ముందుంటుంది. నగర జీవితం చిన్నప్పుట్నుంచే అలవాటైంది కాబట్టి హిందీ సినిమాలపైన కూడా మక్కువ ఏర్పడింది. చిన్నప్పుడు మా నాన్న అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ సినిమాలకు తీసుకెళ్లేవారు. అలా సినిమాల పట్ల ఆకర్షితుడినయ్యా. అంటే, ప్రస్తుతం నేను విహరిస్తున్న రంగుల ప్రపంచపు తొవ్వ ఆయన చూపిందే కదా!
చిరుప్రాయంలోనే సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ
తెలుగు ఉపాధ్యాయుడి కొడుకును అయినందు వల్ల భాష పట్ల, తెలుగు సంస్కృతి సంప్రదాయాల పట్ల సహజంగానే ఆసక్తి ఉండేది. ఎక్కువగా సాంస్కృతిక పోటీల్లో పాల్గొనేవాన్ని. సీతా నిలయం, లలితా కళా మందిరం అనే నాటక కంపెనీల్లో చేరడం వల్ల బాల నటుడిగా నా యాక్టింగ్ ప్రస్థానం మొదలైంది. చాలా నాటికల్లో సహాయ నటుడిగా, హీరోగా నటించాను. ఆ రెండు నాటక కంపెనీల తరఫున అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా తిరిగేవాన్ని. ఆ క్రమంలోనే అన్ని ప్రాంతాల యాసలపై అవగాహన పెంచుకునే అవకాశం దక్కింది. తర్వాత కొంత మంది శ్రేయోభిలాషులు యాక్టింగ్ ప్రొఫెషన్ కోసం స్కూల్‌లో చేరాలని సలహా ఇస్తే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరా.
అన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ..
నటుడిగా ప్రతిభ చాటుతున్నావంటూ అందరూ చెప్తుంటే ఆనందంగా ఉండేది. అంతేకాకుండా అప్పట్లో పత్రికా ప్రముఖులు కూడా నన్ను ఇంటర్వ్యూలు చేశారు. నా నటనా శైలి బాగుందని కితబునిస్తూనే, ప్రముఖులు కొందరు సినిమాల్లో ప్రయత్నాలు చేస్తే పక్కా సక్సెస్ అవుతావని చెప్పేవాళ్లు. అప్పట్నుంచీ అటువైపు దృష్టి మళ్లింది. ఎలాగోలా ఇండస్ట్రీకి దగ్గరై మొదటిసారి ‘నిన్నే ఇష్టపడ్డాను’ సినిమాకు రచనా విభాగంలోనే కాక సహాయ దర్శకుడిగానూ పనిచేశా.
కోన వెంకట్ సహకారంతో ‘వీడే’ సినిమాకు సహాయకుడిగా, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ మూవీకి సహాయ దర్శకుడిగా పనిచేశా. అలా ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లా. నా టాలెంట్ గుర్తించిన రామ్‌గోపాల్ వర్మ ‘షాక్’ సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చారు. అలా ప్రముఖ హీరోలు, నిర్మాతలు, సంస్థలతో కలిసి పనిచేస్తున్న క్రమంలో ఎన్నో విజయాలు, విమర్శలు పలుకరిస్తున్నాయి. ఎవరు చెప్పాలనుకున్న అభిప్రాయాన్ని వాళ్లు చెప్తుంటారు.. అన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ ముందుకెళ్తేనే ఈ జీవితంలో మనకంటూ కొన్ని పేజీలు ఉంటాయి.
-నా సినిమాల్లో పాటలు సూపర్ హిట్..
ఆదిత్య మ్యూజిక్ వారు హరీశ్ శంకర్ హిట్స్ అని క్యాసెట్ రిలీజ్ చేశారు. మామూలుగానైతే మ్యూజిక్ కంపోజ్ చేసిన డైరెక్టర్స్‌కు క్రెడిట్ ఇస్తూ అలా చేస్తుంటారు కానీ, నేను సంగీత దర్శకుడిని కాకపోయినా నాకు ఆ గౌరవం దక్కింది. పాటలు, సాహిత్యం పట్ల ఉన్న అభిలాష, ఆసక్తికి దక్కిన గౌరవంగా భావిస్తా. నాకు మొదటి నుంచీ పాటలంటే చాలా ఇష్టం.
లిరిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ
-నాకు చిన్నప్పటి నుంచీ సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఒక మంచి వాక్యం ఇచ్చిన స్ఫూర్తి మరేది ఇవ్వలేదు. మ్యూజిక్ నాకొక థెరపీ. ముఖ్యంగా లిరిక్స్‌ని చాలా శ్రద్ధగా వినడం, స్ఫూర్తి పొంద డం అలవాటు. నా పాటలు అందరూ లిరిక్స్‌తో గుర్తు చేసుకోవాలనుకోవాలన్న తాపత్రంతో ఉంటా.
కమర్షియల్ సినిమా టెంప్లెట్ విషయంలో నాన్నే స్ఫూర్తి
-మా నాన్నగారు. ఆయన అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. ఆయనే నన్ను సినిమాలకు తీసుకెళ్లేవారు. నేను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడే నాకు సినిమా ఇష్టమని ఆయనకు అర్థమైపోయింది. చిన్నప్పటి నుంచే తెలుగు, హిందీ లిటరేచర్, సినిమాలు అంటే ఇష్టం.- జంధ్యాల గారు, బాపు రమణ గారు సినిమాల్లో మాటలు విపరీతంగా వినేవాడిని. అలాగే ఈవీవీ గారి సినిమాలకు కూడా ఎట్రాక్ట్ అయ్యాను.