బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ పది నెలల తరువాతైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కదలిక రావడాన్ని స్వాగతిస్తున్నామని, పనులు త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఏదుల, నార్లాపూర్ , ఏదుల కరివెన పంప్‌హౌజ్‌లు కేసీఆర్ పాలనలోనే 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్టు స్పష్టంచేశారు.
మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో దూదిమెట్ల బాలరాజుయాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బొమ్మెర రామమూర్తితో కలిసి మాట్లాడుతూ కాలువల పని పెండింగ్‌లో ఉన్నాయని, బీఆర్‌ఎస్ పాలనలో టెండర్లు పిలిచామని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని అన్నారు.
వలసల పాలమూరు జిల్లాను కేసీఆర్ పచ్చగా మర్చారని, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్ హయంలో జిల్లాలో రైస్ మిల్లుల్లో ధాన్యం ఫుల్‌గా నిండిందన్నారు. మిల్లర్లు బకాయిలు కూడా తీర్చుకున్నారని, కాంగ్రెస్ మంత్రులు భేషజాలకు పోకుండా పథకం వెంటనే పూర్తి చేయాలన్నారు.
కేసీఆర్‌కు పేరు వస్తుందని ఈ ప్రాజెక్టును ఇంతకాలం పెండింగ్‌లో పెట్టారని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కంపెనీ కూడా ఈపథకంలో పనులు చేసిందని, మా మీద కోపంతో పనులను ఆలస్యం చేయవద్దని కోరారు. బుధవారం మంత్రులు పాలమూరు ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారని, ప్రాజెక్టు ఎపుడు పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాలని, వట్టెం పంపు హౌజ్ మునక భాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చెక్ డ్యామ్‌లు, కాలువల పూర్తిపై మంత్రులు దృష్టిపెట్టాలని సూచించారు. మంత్రిగా ఉన్న జూపల్లి మా పార్టీ నుంచి వెళ్లిన వారేనని, కేసీఆర్ హయంలో ప్రాజెక్టుల పురోగతి ఆయనకు తెలుసని, వచ్చే పంటకు పాలమూరు ద్వారా నీళ్లిచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని, బీసీ రిజర్వేషన్ల అధ్యయనానికి త్వరలోనే మా పార్టీ బృందం తమిళ నాడు వెళ్లుతుందన్నారు.