calender_icon.png 30 September, 2024 | 2:59 AM

పనిభారం చంపేస్తోంది

30-09-2024 12:00:00 AM

  1. అధిక పని గంటలు భారత్‌లోనే ఎక్కువ
  2. కొవిడ్ నుంచి పెరిగిన వర్క్ టైమింగ్స్
  3. సామాజిక జీవితానికి దూరమవుతోన్న ఉద్యోగులు
  4. ఇటీవల పలువురి మరణంతో మళ్లీ వెలుగులోకి సమస్య

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: అధిక పనిభారంతో భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. కొందరి మరణానికి దారితీస్తున్న ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. కొవిడ్‌తో వర్క్ ఫ్రమ్ హోం సంస్కృతి ప్రారంభమై న నాటి నుంచి పనిగంటలు పెరిగాయి.

ఇంటి కీ, ఆఫీసుకు తేడా లేకపోవడంతో ఉద్యోగులకు స్వేచ్ఛా సమయం కరువైందని అనేకమంది చెబుతున్నారు. విశ్రాంతిగా ఉండే ఇల్లు విభ్రాంతిగా మారిందని పేర్కొంటున్నారు. ఇటీవల ఈవై కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ మరణంతో ఈ అంశం మళ్లీ వెలుగు లోకి వచ్చింది.

ఆమె 4 నెలల పాటు ఫిఫ్టులవారీగా ఎలాంటి సెలవు లేకుండా రోజు14 గంట ల పని చేసిందని ఆమె తల్లి ఆరోపించింది. ఇదే అంశంపై అనేక అంతర్జాతీయ సంస్థలు నివేదికలు విడుదల చేశాయి. అధిక పని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయో వివరించారు. 

భారాన్ని తగ్గించుకోవాలంటే..!

1948 నాటి ఫ్యాక్టరీల చట్టం కార్మికులకు వారానికి 48 గంటలు తప్పనిసరి చేసింది. ఎక్కువ పనిచేస్తే ఓవర్‌టైం వేతనాన్ని అందిస్తుంది. కానీ ఇది ఫ్యాక్టరీ కార్మికులకే వర్తిస్తుంది. వైట్‌కాలర్ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి చట్టం లేదు. పనిలో చేరేటప్పుడు చెప్పే పనిగంటలు కేవలం కాగితంపైనే కనిపిస్తాయి కానీ వాస్తవంగా 24 గంటలు చురుకుగా ఉంటూ కంపెనీ అవసరాల ప్రకారం స్పందించాల్సి ఉంటుంది.

ఉద్యోగం పోతుందనే భయం వల్ల కూడా కంపెనీ యాజమాన్యం చెప్పినట్లు ఉద్యోగులు అధిక గంటలు పనిచేయడానికి అంగీకరిస్తున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు వివిధ మార్గాలను ఆశ్రయించాలని మానసిక నిపుణలు చెబుతున్నారు.

సామాజిక జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని, ఏదైనా ఒక హాబీని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా పనిభారం దృష్టి మరల్చే ప్రయత్నం చేయాలని పేర్కొంటున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో సమయం గడిపి పని ఒత్తిడిని దూరం చేసుకోవాలని చెబుతున్నారు.  

భారత్‌లోనే అధికం

భారత్‌లో ప్రస్తుతం అధిక పనిని అంటువ్యాధిగా భావిస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) ప్రకారం ప్రపంచంలో ఎక్కువ గంటలు పనిచేసే రెండో దేశంగా భారత్ ఉంది. వారానికి దేశంలో 51 శాతం మంది కనీసం 49 గంటలు లేదా ఆపైన పనిచేస్తున్నారు. కానీ వారానికి గరిష్ఠంగా 48 గంటలు (రోజుకు గరిష్ఠంగా 8 గంటలు) మాత్రమే పనిచేయాలని ఐఎల్‌వో ఎప్పటినుంచో సూచిస్తోంది.

అధిక పనిభారం వల్ల ఎక్కువగా డిప్రెషన్‌కు లోనవడం తద్వారా ఒళ్లు నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇతర అనారోగ్యాలకు కారణమవుతున్నాయని ఢిల్లీకి చెందిన మానసిక వైద్యురాలు డాక్టర్ స్నేహాశర్మ పేర్కొన్నారు. దేశంలో 59 శాతం మంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారని మెకిన్సే సర్వే వెల్లడించింది.

పని ఒత్తిడితో ఆగ్రహానికి లోనయిన కేసులు సైతం ప్రపంచవ్యాప్తంగా భారత్‌లోనే అధికంగా ఉన్నాయని, 38 శాతం ఉద్యోగాలు ఈ విధమైన ప్రభావానికి లోనయ్యారని నివేదిక పేర్కొంది .