calender_icon.png 20 January, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనిభారం పెరిగిందా!

28-09-2024 12:00:00 AM

మా అమ్మాయికి ఐటీలో జాబ్ వచ్చింది.. ఏడాదికి 20 లక్షల జీతం.. మా అబ్బాయికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది.. నెలకు రెండు లక్షల జీతం.. అంటూ తల్లిదండులు ఫ్రెండ్స్‌కు, బంధువులకు చెప్పుకుంటూ మురిసిపోతారు. అయితే ఉద్యోగం ఏదైనా కానీ.. పని ఒత్తిడి కారణంగా జీవితంలో చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదించలేకపోతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనలో చాలామంది మెదడును ఓ కండరంలా కాకుండా.. నిరంతరం పనిచేసే ఓ కంప్యూటర్ లాగా ఒక యంత్రంలాగా భావిస్తుంటారు. అది అవాస్తవం. బ్రేక్ లేకుండా నిరంతరం పనిచేసే ఒత్తిడి హానికరం. ఎక్కువ గంటల పాటు పనిచేయడం వల్ల.. హృదయ సంబంధిత వ్యాధుల ముప్పు 40 శాతం పెరిగే అవకాశం ఉందని ఒక విశ్లేషణలో వెల్లడైంది. అది ధూమపానంతో సమానం. ఎక్కువ గంటలు పనిచేసే వారికి బ్రెన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.   

ప్రస్తుతం ఉద్యోగం సంపాదించడం యువతకు ఓ పెద్ద సవాలుగా మారింది. సంపాదించిన ఉద్యోగం నిలబెట్టుకోవడం కోసం పెద్ద కసరత్తే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే.. ఉన్న ఉద్యోగం పోతే మళ్లీ కొత్త ఉద్యోగం సంపాదించుకోవడం కష్టమవుతుంది. కనుక ఎలాగైనా ఉన్న ఉద్యోగంలోనే కొనసాగాలని ప్రతిఒక్కరూ ఆలోచన చేస్తున్నారు. ఇలా ఆలోచించినవారు  చాలా ఒత్తిడికి గురవుతున్నారు.

ముఖ్యంగా వ్యక్తిగత సమస్యలు, సమయానికి ఆహారం, నిద్ర సరిగ్గా లేకపోవడం, పోటీతత్వం, అదనపు బాధ్యతలు, గుర్తింపు నోచుకోకపోవడం కారణంగా ఉద్యోగంలో ఒత్తిడికి గురవుతున్నా రు చాలామంది. అయితే ఈ అధిక పని ఒత్తిడి అనేది మనిషిని మానసికంగా కృంగదీసేలా చేస్తుంది.

ఈ క్రమంలోనే పని ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకోవడం, హఠాత్తుగా కుప్పకూలిపోవడం వంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలానే జరుగుతున్నాయి. తాజాగా ఓ బ్యాంకు ఉద్యోగి కూడా ఇలానే విధుల్లో ఉండగా.. ఊహించని దారుణం చోటు చేసుకుంది..

“లక్నోలో ఓ ప్రైవేట్ బ్యాంకులో డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా.. సదాఫ్ ఫాతిమా విధులు నిర్వహిస్తున్నది. అయితే ఎప్పటిలానే ఆఫీసుకు వెళ్లి విధులు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి కుర్చీలోనే ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దీంతో వెంటనే గమనించిన తోటి ఉద్యోగులు ఆమెను స్థానిక ఆసుప్రతికి తరలించారు.

కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే.. మృతురాలు ఫాతిమాకు ఇటీవలే డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించారని, అప్పటి నుంచే ఆమె తీవ్రమైన పని ఒత్తిడికి గురైందని సహ ఉద్యోగులు చెబుతున్నారు”.

26 ఏళ్ల యువతి.. 

అకౌంటింగ్ కంపెనీ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై)లో సీఏగా పని చేస్తున్న అన్నా సెబాస్టియన్ పెరయిల్ (26) అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరయిల్ పుణెలోని ఈవై కంపెనీలో నాలుగు నెలల క్రితమే ఉద్యోగంలో చేరింది.

పెరాయిల్ తల్లి అనితా అగస్టిన్ ఆ కంపెనీ భారత సీఈఓ రాజీవ్ మెమోమానికి ఈ మెయిల్ పంపి, తన కూతురు కంపెనీలో పని ఒత్తిడి వల్లే చనిపోయిందని చెప్పింది. దీంతో దేశంలో కొత్త ఉద్యోగులపై పని ఒత్తిడి అధికంగా ఉంటోందని, వారితో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. 

104 రోజులు ఏకధాటిగా..

చైనాలో ఓ వ్యక్తి సెలవు తీసుకోకుండా.. కనీసం వీక్ ఆఫ్ కూడా వినియోగించకుండా 10౪ రోజులు పని చేయడంతో ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడ్డాడు. వృత్తిరీత్యా పెయింటర్ అయిన అబావో అనే 30 ఏళ్ల వ్యక్తి.. ఓ ప్రాజెక్టు పని కోసం ఒప్పందంపై సంతకం చేశాడు. సెలవు లేకుండా ప్రతిరోజు పని చేయడంతో ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాడు.

అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అబావోకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ సోకినట్లు తేల్చారు. చివరికి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అయితే పని ఒత్తిడి, ఎక్కువ సమయం పని చేయడం వల్లే అబావో మరణించాడని, ఇందుకు యజమానిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబం కోర్టును ఆశ్రయించింది.

కానీ యజమాని మాత్రం తన చర్యలను సమర్థించుకున్నాడు. అబావో కేవలం సమయానుసారమే పనిచేసినట్లు తెలిపాడు. తనే స్వచ్ఛందంగా అదనంగా పని చేశాడని, ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి నట్లు పేర్కొన్నాడు.

కానీ యజమాని వ్యాఖ్యలతో న్యాయ స్థానం ఏకీభవించలేదు. అబావో మరణానికి కంపెనీ 20 శాతం బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించింది. 104 రోజులు నిరంతరం పని చేయడం అనేది చైనీస్ లేబర్ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. 

మన దేశంలో కరోషి.. నిజమా?

లాన్సెట్ జర్నల్‌లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం వారానికి 55 గంటల కంటే ఎక్కువ గంటలు పని చేసే వ్యక్తులకు గుండె పోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడైంది. ప్రస్తుతం మన దేశంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది.

ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చొని పని విషయాల గురించి మాట్లాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఈ సంస్కృతి మన దేశంలో ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఎకానమీ టార్గెట్‌గా..

ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఎకానమీ టార్గెట్‌లను సీరియస్‌గా తీసుకుంటున్నాయని, అది ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడికి దారితీస్తుందని అన్నారు. అలాగే దీనికి అడ్డుకట్ట పడాలంటే.. పని ప్రదేశాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. కష్టపడి పని చేయడం అవసరమైనప్పటికీ, అధిక గంటలు పని చేయడం ప్రామాణికం కాకూడదని చెప్పారు. అధిక పని గంటల వల్ల స్ట్రోక్ ముప్పు 35 శాతం, గుండె జబ్బుల ప్రమాదం 17 శాతం పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌వో) చెప్పిందని తెలిపారు. 

విరామం అవసరం..

ప్రపంచ స్థాయిలో ఒక దేశపు ఉత్పాదక సామర్థ్యం ఆ దేశపు సగటు పని గంటల మధ్య సంబంధమేమీ లేదు. ఏ నైపుణ్యంలోనైనా ప్రావీణ్యం పొందటం కోసం అవసరమైన సాధన అవసరం. అయితే చేసే పనుల్లో మధ్య మధ్యలో విరామం చాలా అవసరం. గొప్ప గొప్ప మ్యుజీషియన్లు, రచయితలు, క్రీడాకారులు వృత్తి కోసం రోజుకు ఐదు గంటలకు మించి ఎక్కువ సమయం కేటాయించరు. చిన్న చిన్న విరామాలు తీసుకోవడం ద్వారా పనిలో ఏకాగ్రత పెరుగుతుందని అధ్యయనాల్లోనూ వెల్లడైంది. 

ఉద్యోగుల ఆరోగ్యం కోసం..

  1. ఏదైన సంస్థ ఉద్యోగంలో భాగంగా కొన్ని ఆరోగ్యకరమైన నియమాలను పాటిస్తే బాగుంటుంది. అవి ఏంటంటే..
  2. స్టాండింగ్ డెస్క్‌లు లేదా స్టాండింగ్ మీటింగ్‌లు ఏర్పాటు చేయడం.
  3. ‘డెస్క్ ఎక్సర్‌సైజ్‌లు’ ఉద్యోగులు వారి డెస్క్‌ల వద్ద సాధారణ స్ట్రెచ్‌లు చేసేలా ప్రోత్సహించడం.
  4. విరామ సమయానికి సంబంధించి స్పష్టమైన విధానాలు ఉండటం. విశ్రాంతి గదులను ఏర్పాటు చేయడం.
  5. ఉద్యోగులు సమయానికి భోజనం చేయటానికి క్యాంటీన్లు పెట్టడం.
  6. యోగా, ధ్యానం, జుంబా, న్యూట్రిషన్, వెల్నెస్ వర్క్‌షాప్‌లు వంటి ఆరోగ్య సెషన్‌లను నిర్వహించడం.
  7. పని విషయంలో ఎదురవుతున్నా ఒత్తిడిని అధిగమించడానికి మీటింగ్‌లు నిర్వహించడం.

మనమెక్కడ?

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా వారానికి 49 గంటలు పనిచేస్తున్న దేశాల్లో మనదేశం మొదటి స్థానంలో ఉంది. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉద్యోగులు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలకు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇవన్నీ జీవన ప్రమాణంపై ప్రభావం చూపుతున్నాయి. 

కరోషి సంస్కృతి

అధిక పని ఒత్తిడి కారణంగా మరణించే అవకాశం ఉందని జపనీయులు ఒక పదాన్ని సృష్టిం చారు అదే కరోషి. ఈ పదానికి  అర్థం ‘ఓవర్ వర్క్ డెత్’ అధిక పని ఒత్తిడితో మరణించటం. నిపుణులు దీన్ని సైలెంట్ కిల్లర్‌గా కూడా అభివర్ణిస్తున్నారు. ఇది వృత్తిపరమైన ఆకస్మిక మరణానికి సంబంధించినది. కరోషి మరణాలు సాధారణంగా పని ఒత్తిడి, పోషకాహార లోపం, నిద్రలేమి సమస్యలతో వస్తాయి.

ఈ కారణంగా గుండెపోటు, స్ట్రోక్‌లు వచ్చే ప్రమాదం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ఆర్థిక వ్యవస్థను బలపరుచుకునే ప్రయత్నంలో అక్కడి కార్మికులు విపరీతంగా పని చేయడం మొదలుపెట్టారు. విపరీతమైన పని ఒత్తిడి, నిద్రలేమి, జీవితంలో సమతుల్యత లేకపోవడం వల్ల కొంతమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

అలాగే కొంతమందికి స్ట్రోక్‌లు, గుండె ఆగిపోవడం లేదా కార్డియాక్ అరెస్ట్‌లకు గురయ్యారు. ఇప్పటికీ జపాన్‌లో ఈ పరిస్థితి మారడం లేదు. మన దేశంలో ఐటీ కంపెనీల రాకతో.. ఓవర్ టైం పని చేసే ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. చాలామంది ఉద్యోగులు చిన్నవయసులో అధిక పని భారం కారణంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.   

శిక్షణ పేరుతో..

పూణేలో యువతి మృతి చెందిన తీరు వ్యవస్థాగత సమస్యను ఎత్తిచూపింది. కొత్తగా ఉద్యోగ జీవితంలోకి అడుగు పెట్టిన యువత నుంచి చేస్తున్న శ్రమ దోపిడీ సమస్యను పారిశ్రామికవేత్తలు వెంటనే పరిష్కరించాలి. ఉద్యోగంలో చేరిన యువతకు శిక్షణ పేరుతో లేదా పోటీ ప్రపంచానికి వారిని సన్నద్ధం చేయడం అనే ముసుగులో వారితో అధికంగా పని చేయిస్తున్నారు.  

 హెచ్‌సీఎల్ మాజీ సీఈవో వినీత్ నాయర్

- రూప