28-02-2025 07:30:52 PM
కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన సిమెంట్ పనులను నెలాఖరులోగా పూర్తిచేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బానోత్ దత్తారాం లతో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఎ. పి. ఓ.లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఉపాధి హామీ పనుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడి భవనాలు, సిసి రహదారులు, మురుగు కాలువల నిర్మాణం, నర్సరీల నిర్వహణ, ఉపాధి హామీ పథకం పనులలో కూలీల హాజరు శాతం పెంపుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిని పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. గ్రామపంచాయతీ, అంగన్వాడి భవనాల నిర్మాణ పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేసి, ఎం. బి. రికార్డులు సమర్పించాలని తెలిపారు. సిసి రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, 100 శాతం నాణ్యత పై దృష్టి సారించాలని తెలిపారు. ఉపాధి హామీ పనులలో కూలీల హాజరు శాతం పెంపొందించాలని, అది సెగ అధికారులు కూలీలకు అవగాహన కల్పించాలని తెలిపారు. క్షేత్ర సహాయకులు, కార్యదర్శులకు లక్ష్యాన్ని నిర్దేశించాలని తెలిపారు. అభివృద్ధి పనులను నిర్వహణ, నాణ్యత ప్రమాణాలలో నిర్లక్ష్యం, అలసత్వం వహించిన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ ఈ.ఈ. ప్రభాకర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.