calender_icon.png 16 January, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల చాటున దళారుల మాటు!

12-07-2024 12:34:05 AM

  1. యథేచ్ఛగా లారీల్లో చెరువు మట్టి రవాణా
  2. ఇటుక బట్టీలకు సరఫరా
  3. చోద్యం చూస్తున్న మైనింగ్, ఇరిగేషన్ అధికారులు

నల్లగొండ, జూలై 11 (విజయక్రాంతి): నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు లేకపోవడం, ఏడాదిగా తీవ్ర వర్షాభావం కారణంగా ఆయకట్టు పరిధిలోని చెరువుల్లో నీరు లేకుండా పోయింది. దీన్ని ఆసరాగా చేసుకొని చెరువులు, కుంటల్లో మట్టిని రైతులపేరుతో తీస్తూ ఇటుక బట్టీలకు విక్రయించి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని చాలాచోట్ల ఈ దందా మూడు టిప్పర్లు.. ఆరు ట్రిప్పులుగా సాగుతోంది. టిప్పర్‌కు రూ.3 వేల నుం చి రూ.5 వేల వరకు బట్టీల యజమానులు చెల్లిస్తున్నట్టు తెలిసింది. కొన్ని చోట్ల బట్టీల నిర్వాహకులే రైతుల పేరిట అనుమతులు తీసుకొని వారికి కొద్దోగొప్పా చెల్లించి నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వుకుంటున్నారు. మరికొన్ని చోట్ల అధికార పార్టీ నాయ కులు క్షేత్రస్థాయి అధికారులను మేనేజ్ చేసి దందాను నడుపుతున్నట్టు ఆరోపణలున్నా యి. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా స్పందన కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ మం డలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో చెరువు మట్టి తరలించేందుకు అరకొర అనుమతులు తీసుకుంటున్న దళారులు.. అడ్డగోలుగా తరలిస్తున్నారు. 

దందాకు అడ్డుకట్ట వేసేదెవరు? 

జిల్లాలో చాలాచోట్ల చెరువుల్లో నుంచి మట్టి యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నా నిలువరించే బాధ్యత తమది కాదంటూ రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ శాఖల అధికారులకు దళారులు భారీగా ముడుపులు ముట్టజెపుతుండటంతో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వస్తే తూతూ మంత్రంగా పర్యటించడం తప్ప మట్టి మాఫియాను అడ్డుకోవట్లేదు. మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ మండలాల్లోని మట్టి మాఫియా నడిపే దళారులు రూ.కోట్లలో వెనకేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో పెద్ద ఎత్తున ఇటుక బట్టీలు ఉన్నాయి. ౩ నెలలుగా నిర్మాణాలు ఊపందుకోవడంతో ఇటుకల తయా రీకి మట్టి భారీగా అవసరం ఉంటుంది. ఏడాదిగా వర్షాలు లేకపోవడంతో రైతుల పేరిట   నాలుగైదేండ్లకు సరిపడా మట్టిని బట్టీల ఆవరణలో డంపు చేసుకుంటున్నారు.

వివాదాస్పదంగా మట్టి తరలింపు

వేములపల్లి మండలం పెద్దచెరువు నుంచి మాడుగులపల్లి మండలంలోని గండ్రవానిగూడేనికి టిప్పర్లలో భారీగా చెరువు మట్టి తరలిస్తున్నారు. ఇక్కడ ౧౫కుపైగా ఇటుక బట్టీలున్నాయి. 20 నుంచి 30 టిప్పర్లలో కొన్ని రోజులుగా మట్టి తరలిస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున మట్టి రోడ్డుపై పడుతుంది. దీంతో వాహనాల రాకపోకలకు విఘాతం ఏర్పడుతుంది. వర్షం కురిస్తే వాహనదారులు ప్రమా దాల బారినపడే అవకాశం ఉండటంతో రెండురోజుల క్రితం టిప్పర్లను గ్రామ స్థులు అడ్డుకున్నారు. ఇటుక బట్టీల నుంచి వచ్చే కాలుష్యంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నామని, తమ గ్రామం నుంచి టిప్పర్లను తిరగ నివ్వబోమని భీష్మీంచారు. అయినా దళారు లు వినకుండా మట్టి తరలిస్తుండటంతో పరిస్థితి వివాదాస్పదంగా మారింది. దేవరకొండ పట్టణ శివారులోని వీరసముద్రం చెరువు నుంచి వారంరోజుల క్రితం మట్టి తరలిస్తుం డ గా స్థానికులు 11 టిప్పర్లను అడ్డుకొని పోలీసులకు అప్పగించడం చర్చనీయాంశమైంది.

నీటి పారుదల అధికారుల నిర్లక్ష్యం

జిల్లాలో చెరువుల హద్దులను గుర్తించడంలో నీటిపారుదల శాఖ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెవెన్యూ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయం లోపించడంతో హద్దులను గుర్తించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నల్లగొండ జిల్లాలో సుమారు 3 వేల చెరువులున్నాయని అధికారులు చెప్తున్నారు. చాలాచోట్ల చెరువులకు హద్దులు గుర్తించకపోవడం తో ఎఫ్‌టీఎల్ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. చెరువుల పునరుద్ధరణ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. రెవెన్యూ, నీటి పారుదల అధికారులు స్పందించి చెరువులకు హద్దులు గుర్తించి వాటిని సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. 

అధికారులు చర్యలు తీసుకోవాలి

వేములపల్లి చెరువు నుంచి గండ్రవానిగూడెంఇటుక బట్టీలకు మట్టి తరలించకుం డా అధికారులు చర్యలు తీసుకోవాలి. నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు తిరుగుతుండటంతో రోడ్డు అధ్వానంగా మారు తోంది. గ్రామస్థులు అడ్డుకుంటున్నా ఫలితం లేదు. బట్టీల యజమా నులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని ఇటుక బట్టీలను మూసివేయాలి.

 చింతకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి,

మాజీ సర్పంచ్, గండ్రవానిగూడెం