calender_icon.png 15 January, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాట ఇచ్చినం.. రుణమాఫీ చేస్తున్నం

18-07-2024 12:39:19 AM

రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయం

నెలరోజుల ముందే చేస్తున్నాం

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ఆగస్టు 15 లోగా రైతు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని కానీ, అంతకంటే నెలరోజుల ముందుగానే హామీని నిలబెట్టుకుంటున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణ విముక్తి కల్పించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు.

రూ.1లక్ష రుణమాఫీ ఒకేసారి సాధ్యం కాదని నాడు కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటిస్తే, నేడు సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని, బీఆర్‌ఎస్ సర్కారు నిర్వాకం వల్ల రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నాటికి రూ.1లక్ష వరకు రుణమాఫీ చేస్తున్నామని , ఇది రాష్ర్ట చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని తెలిపారు. 16ఏళ్ల క్రితం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం  రైతాంగానికి రూ.72 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు, వడ్డీలను ఒకేసారి మాఫీ చేసిన విషయాన్ని పొంగులేటి గుర్తు చేశారు. రైతులు ఆర్థికంగా బలపడడానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసాఇచ్చారు.