ఒక మహావిపత్తు మానవాళికి అనివార్యంగా ఎంతో నేర్పింది. కరో నా కల్లోలం ఉప్పెనలా వచ్చి అనేకమంది ప్రాణాలను బలిగొంది. ‘కోవిడ్- మేఘా లు తొలగినా అది నేర్పిన జీవన పాఠాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనిషి జీవనశైలిలో అపార మార్పులు తెలియకుండానే చోటు చేసుకొన్నాయి. రకరకాల వైరస్‌లు ప్రపంచ మానవాళికి గుణపాఠం నేర్పాయి. ఫలితంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, ఈ- ఈ- వైద్యసేవలు లాంటి అనేక రంగాలను పరిచయం చేశాయి. ఎన్నో నూతన వ్యాపారాలకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలోనే గృహ -ఆధార వ్యాపారాలకు ఆదరణ పెరిగి విజయవంతమవుతూ, ఒక లాభసాటి ఉపాధిగా కొనసాగుతున్నాయి. ఇంటినుంచే ఔత్సాహిక మహిళలు పలు వ్యాపారాలు చేయడానికి చక్కగా అలవాటు పడుతున్నారు. ఇలాంటి వారినే ‘ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్రమ్ హోం’ లేదా ‘హోంప్య్రూనర్స్’గా గుర్తిస్తున్నారు.
నేడు దేశ వ్యాప్తంగా దాదాపు 80 శాతానికి పైగా ‘హోం ప్య్రూనర్స్’ మహిళలే కావడం విశేషం. ప్రతికూల పరిస్థితులు, ఆదరణ తగ్గినా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ బిజినెస్‌లో ఇండియా 2014లో 142వ స్థానంలో ఉండగా, 2021లో 63వ స్థానానికి ఎగబాకింది. కరోనా ప్రళయ అలల నడుమ ఔత్సాహికులు తమ నూతన వ్యాపార మార్గాలను వెతకడం, ఆకర్షణీయంగా కొనసాగించడం వేగంగా జరుగు తున్నాయి. గృహ కేంద్రిత వ్యాపారాల స్థాపన, సమర్థవంతమైన నిర్వహణ, ఆన్‌లైన్ అమ్మకాలు, నిర్వహణలో ఎదురయ్యే అవరోధాలను పరిష్కరించడానికి మహిళలు నిర్వహిస్తున్న ‘ఘరో బార్’ (ఘర్ సే కారోబార్) లాంటి సంస్థలను నెలకొల్పడం కూడా ఔత్సాహికులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నది.
పురుషులకు దీటుగా అభివృద్ధి
కరోనా విపత్తుతో ఉద్యోగాలు కోల్పోయిన మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఇంటినుంచే వ్యాపారాలు ధీటుగా నిర్వహించడం నేడు చూస్తున్నాం. వంటింటి కుం దేళ్లని హేళన చేసిన సమాజం నేడు గృహ- ఆధార వ్యాపారాలు చేస్తున్న తీరు పలువురిని ఆశ్చర్యపరుస్తున్నది. వస్త్రాలంకరణ, వస్త్ర విక్రయ కేంద్రాలు, ఫేషన్ డిజైనింగ్, గృహోపకరణాలు, హస్తకళలు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, బేకింగ్, కుకింగ్, యోగా, ఫిట్‌నెస్, హోమ్ ఫుడ్స్ లాంటి పలు వ్యాపారాలను ఇంటినుంచే నిర్వహిస్తూ మంచి గుర్తింపుతోపాటు ఆర్థికంగానూ లాభాలు గడిస్తున్నారు. వీటికితోడు టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లను, విలక్షణ అవకాశాలను మహిళామణులు అంది పుచ్చుకుంటూ పురుషులకు ధీటుగా అభివృద్ధి చెందుతూ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలను చేరుకుంటున్నారు.
ఇలాంటి గృహ- ఆధార వ్యాపారాలతో నిరుద్యోగం తగ్గడం, మహిళలకు స్వేచ్ఛ పెరగడం, లింగ అసమానతలు తగ్గడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వడం జరుగుతున్నది. స్వంత వ్యాపారానికి యజమానురాలిగా తన సమయాన్ని కేటాయించడం, ఆత్మగౌరవం పొందడం, మరి కొందరికి ఉద్యోగ ఉపాధులను కల్పించడం, కుటుంబానికి ఆర్థిక బలాన్ని చేకూ ర్చడం, తనదైన శైలిలో నడపడం వంటివాటితోసహా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇతరులపై ఆధార పడకుండా స్వేచ్ఛ, సౌకర్యాలను పొందుతున్నారు.
గృహ -ఆధార మహిళా వ్యాపారాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు, సమాజం మరింతగా ముందుకు రావాలి. మహిళా సాధికారత సాధనకు ఈ వ్యాపారాలు ఎంతగానో దోహద పడడం చూస్తున్నాం. నేటి అనేక బహుళజాతి కంపెనీలు ప్రారంభంలో గృహాల్లో, ఇంటి గ్యారేజీల్లోనే ప్రారంభమైనవే అని గుర్తు చేసుకోవాలి. మార్కెట్ సరళిని అధ్యయనం చేసి, డిజిటల్ సాంకేతికతను జోడించి, సృజనకు పెద్దపీట వేసి గృహ సంబంధ వ్యాపారాలను ప్రారంభించడానికి ఔత్సాహిక గృహిణులు చొరవ చూపాలి. తమ వ్యాపార వివరాలను వెబ్‌సైట్స్‌లో పొందుపరిచి అమ్మకాలను పెంచుకోవాలి. ఒక అంచనా మేరకు జనవరి 2022 నాటికి 1000 మంది గృహ- ఆధార వ్యాపారాలను పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఇంటి నుంచే వ్యాపారాలు చేయడానికి ఆసక్తి చూపుతున్న మహిళలకు మా‘నవ’ సమాజం, ప్రభుత్వం కావలసిన మేర ఊతమివ్వవలసి ఉంది.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
సెల్: 9949700037