calender_icon.png 21 October, 2024 | 6:46 AM

విజేత న్యూజిలాండ్

21-10-2024 01:16:48 AM

దుబాయ్: న్యూజిలాండ్ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ వాసులకు ఆదివారం అదిరిపోయింది. పురుషుల జట్టు భారత్‌పై 36 సంవత్సరాల తర్వాత గెలవగా, మహిళల జట్టు ఏకంగా టీ20 ప్రపంచ కప్‌నే కైవసం చేసుకుంది. 43 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు కూడా తీసుకున్న అమెలియా కెర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన (135 పరుగులు, 15 వికెట్లు) చేసినందుకు గానూ కెర్‌కే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. టాస్ గెలిచి బౌలింగ్‌కు దిగిన సఫారీలు న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో ఎవరూ రాణించలేదు.

159 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సఫారీలు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులకే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో కెర్, మెయిర్ చెరి 3 వికెట్లతో సత్తా చాటారు. న్యూజిలాండ్ జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకోవడం ఇది తొలిసారి.  తొలి ఎడిషన్‌లో ఫైనల్ చేరిన న్యూజి లాండ్ ఈ సారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. సౌతాఫ్రికా మాత్రం 2023తో పాటు ఈ సారి కూడా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.