30-04-2025 12:25:12 AM
గజ్వేల్‌లో తడిసిన ధాన్యం విరిగిన చెట్లు, ఎగిరిపోయిన ఇండ్ల పైకప్పులు
గజ్వేల్, ఏప్రిల్ 29: గజ్వేల్ నియోజకవర్గం లో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా గాలివాన బీభత్సం సృష్టించింది. గజ్వేల్, మర్కుక్, ములుగు తదితర మండలాల్లో సాయంత్రం ఒక్కసారిగా బలమైన గాలులతో వర్షం ప్రారంభమైంది. ప్రజ్ఞాపూర్ నుండి జగదేపూర్ వెళ్లే మార్గంలో శ్రీగిరి పల్లి బస్టాండ్ సమీపంలో రోడ్డుపై భారీ చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మకుక్ మండలం పాములపర్తి తదితర గ్రామాల్లో రోడ్లపై కల్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యం గాలివానకు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. పలువురు ఇండ్లపై ఉన్న రేకుల కప్పులు గాలులకు ఎగిరి దూరంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వందల మీటర్ల దూరంలో రేకులు పడిపోయాయి. వర్షం వస్తుందని తెలుసుకునే లోపే ఒక్కసారిగా గాలివాన ప్రారంభం కావడంతో ఒక గంటలో తీవ్ర బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి కూడా పలుచోట్ల కురిసే అవకాశం ఉంది.