20 రోజులు నరకం చూపిన భర్త..
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
కామారెడ్డి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): భర్త పెట్టే చిత్రహింసలు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. నిజామాబాద్‌కు చెందిన రంగారాణి(30)కి, కామారెడ్డికి చెందిన గంగాధర్‌గౌడ్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. ఆ సమయంలో రంగారాణి తల్లిదండ్రులు కట్నకానుకలు ఇచ్చారు. అప్పటి నుంచి వారు కామారెడ్డి హౌజింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్నారు. వారికి ఇద్దరు సంతానం. అయితే గత గత మూడు సంవత్సరాల నుంచి రంగారాణిపై గంగాధర్‌గౌడ్ అనుమానం పెంచుకుని చిత్రహింసలకు గురిచేస్తూ హింసించేవాడు.
తల్లిగారి ఇంటి నుంచి డబ్బులు తేవాలని శారీరకంగా హింసించేవాడు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం రంగరాణి పురుగుల మందు తాగి ఆత్మహత్యాత్నానికి పాల్పడిందని గంగాధర్ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. వారు వచ్చి కామారెడ్డిలోని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం హైదారాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది.
ఇదిలా ఉండగా గత 20 రోజులుగా తమ కూతురు ఫోన్‌లో తమతో మాట్లాడలేదని, 20రోజులుగా ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురి చేయడంతోనే ఆత్మహత్యాయత్నం చేసిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గంగాధర్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బంధువులు మృతదేహంతో కామారెడ్డిలో ఆందోళన చేశారు. విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.