28-04-2025 02:03:01 AM
హైదరాబాద్, ఏప్రిల్27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మనసంతా విషం తో నిండిపోయిందని రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. వరంగల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో సాగిన ఆయన ప్రసంగం మొత్తం లో కాంగ్రెస్‌ను విలన్‌లా చిత్రీకరించడం తప్ప, ఇంకేమీ లేదని అన్నారు. మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో కేసీఆర్ చేసిన ప్రసంగంపై ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద మంత్రి పొంగులేటి మీడి యాతో మాట్లాడారు. కేసీఆర్ తీరును తప్పుబట్టారు. ‘గత సీఎం పరిపాలన వల్లే ధనిక రాష్ట్రం అప్పులపాలైంది. అప్పులున్నా.. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరిస్తున్నారా? కడుపంతా విషం నింపుకొని కేసీ ఆర్ మాట్లాడటం బాధ కలిగించింది.
రెండుసార్లు బీఆర్‌ఎస్‌కు అధికారమిస్తే.. ఎలా కొల్ల గొట్టారో ప్రజలు చూశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి.. మంచి సలహాలు ఇస్తారని ఎదురుచూశాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐదారు పర్యాయాలు అసెంబ్లీ జరిగింది. కేవ లం రెండుసార్లే కేసీఆర్ వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి కూడా ఆయన వెళ్లలేదు. కేసీఆర్ దొర మాదిరిగా పరిపాలిస్తే.. మా ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అందుబాటులో ఉంది.
ప్రజలకు కాంగ్రెస్ అందిస్తున్న సుపరిపాలన చూసి తట్టుకోలేక కేసీఆర్ విషంకక్కారు. గతంలో వరి వేస్తే ఉరి అని చెప్పి.. కేసీఆర్ మాత్రం 150 ఎకరాల్లో వరి వేశారు. దయ్యా లు వేదాలు వల్లించినట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంట్రా క్టర్లకు రూ.82 వేల కోట్లు బకాయిలు పెట్టిం ది. సర్పంచులకు కాంగ్రెస్ బకాయిలు పెట్టిందని కేసీఆర్ అంటున్నారు. మా ప్రభుత్వం వచ్చాక సర్పంచులే లేరు.
మా ప్రభుత్వంలో సర్పంచులు ఒక్క రూపాయి పని కూడా చేయలేదు. అధికారంలోకి రావాలని కేసీఆర్ పగటికలలు కంటున్నారు. బీఆర్‌ఎస్ సభకు ఆటంకాలు సృష్టించామని ఆయన ఆరోపించారు. సభకు అస్సలు ఆటంకం సృష్టించ లేదు.. మేమే ఇబ్బంది పెట్టి ఉంటే సభ జరిగేదా.. ఆ పార్టీ నేతలు అడిగినన్ని బస్సులను సభకు పంపాం’ అని శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.
కేసీఆర్ పదేళ్లలో కలిపి కనీసం లక్ష ఇండ్లు కూడా కట్టలేదని.. తాము నాలుగున్నర లక్షల ఇండ్లు కట్టిస్తున్నామని పొంగు లేటి వ్యాఖ్యానించారు. సర్పంచులకు బాకీ లు ఉన్నాయని బీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్న పెండింగ్ అంతా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చెల్లించకుండా వదిలేసినవేనని తెలిపారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని నిధులు రూ.1,500 కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. గురివింద సామెతలా కేసీఆర్ మాటలు ఉన్నాయని ఆరోపించారు.
అధికారం పోయిన బాధ తప్ప మరేం లేదు: మంత్రి సీతక్క
నియంత అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొన్న తీరుగా కేసీఆర్ వ్యవహారం కనిపిస్తోందని మంత్రి సీతక్క ఫైరయ్యారు. కేసీఆర్ బాధ కేవలం అధికారం పోయిందనే తప్ప మరేదేం కాదన్నారు. ప్రజల కోసం ఆయనకు బాధ ఉంటే గత పదేళ్లలో ప్రజలకు ఏం ఒరగబెట్టారో చెప్పాలన్నారు.
ఇంటికో ఉద్యోగం అన్నాడని.. కానీ ఆయన్ను నమ్ముకొని ఉద్యమం చేసిన నిరుద్యోగులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నా రు. తాము 15 నెలల్లో 59 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేసే వారిపై కేసులు తప్పనిసరిగా నమోదు చేయిస్తామన్నారు.
తన బిడ్డ ఖరీదైన కార్లలో తిరగవచ్చు కానీ, తెలంగాణ ఆడపచులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తే కూడా ఓర్వలేక తన మనుషులను పంపించి కొట్టుకొనేలా చేస్తున్నారని కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. అధికారం పోయాక కేసీఆర్ తన అక్కసును వెళ్లగక్కుతున్నారని విమర్శించారు.
అసెంబ్లీలో సొల్లు కబుర్లు అని మాట్లాడే కేసీఆర్‌కు అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. అలాంటప్పుడు నీ అల్లుడు, కొడుకుని సొల్లు కబుర్ల కోసం అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నావని నిలదీశారు.
కేసీఆర్ వద్ద ఎన్ని వేల కోట్లుండాలి: మంత్రి జూపల్లి
ఇరిగేషన్ ఈఎన్‌సీపై ఏసీబీ దాడుల్లో రూ.200 కోట్లు దొరికితే, కేసీఆర్ వద్ద ఎన్నివేల కోట్లు ఉంటాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. కాళేశ్వరం ఇంజినీర్, కాంట్రాక్టర్, డిజైనర్ అంతా కేసీఆరే అని విమర్శించారు. పదేళ్లు పాలించిన కేసీఆర్, 16 నెలల కాంగ్రెస్ సర్కారుపై ఆరోపణలు చేయడం, కాంగ్రెస్ పార్టీని విలన్‌గా చూపే ప్రయత్నం చేశారని విమర్శించారు.
తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చిందని.. అప్పట్లో ఆమెను దేవతగా అభివర్ణించి, ఇప్పుడు ఇలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే అప్పటివరకు రూ.64 వేల కోట్ల అప్పుంటే.. కేవలం 10 ఏళ్లలో రూ.8 లక్షల కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
గతంలో ఏడాదికి రూ.6 వేల కోట్ల వడ్డీ కడితే, ఇప్పుడు నెలకు రూ. 6వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా చాలా చోట్ల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టేలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకమైనా తాము ఎత్తేశామా అని ప్రశ్నించారు. హెచ్‌సీయూ భూములను పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు.
అంత పెద్ద మీటింగ్ పెట్టి, కేవలం కేసీఆర్ మాత్రమే ప్రసంగించడం ఆయన నిలువెత్తు నిరంకుశత్వానికి ఉదాహరణ అని అన్నారు. చింత చచ్చినా పులుపుచావలేదని విమర్శించారు. కేసీఆర్ అంత నిజాయతీ మనిషి అయితే బీఆర్‌ఎస్ పార్టీ ఖాతాలో రూ.1,500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఏ ఒక్క విషయంలోనూ ఈ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదన్నారు.
ఇతరుల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన ఖర్మ ఎందుకు పట్టిందన్నారు. నిందితులు విదేశాల్లో తలదాచుకున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడమనేది అసాధ్యమన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్, ఫాం హౌజ్‌కు వెళ్లాలన్నా ఎంతో కష్టంగా ఉండేదని తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్‌కు జ్ఞానోదయం కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు.
విలన్ అన్న మాట ఉపసంహరించుకోవాలి: మంత్రి పొన్నం
కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అన్న కేసీఆర్ మాటలు ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. రేపు తెలంగాణలో అన్ని జిల్లా ల్లో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాలని కాంగ్రెస్ పార్టీని కోరారు. సోనియాగాంధీ కాదం టే తెలంగాణ ఎలా వచ్చేదని ప్రశ్నించారు. కేసీఆర్ అంతర్గత కలహాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, ఆ అసహనం ఆయన మాటల్లో స్పష్టంగా తెలుస్తోందన్నారు.