calender_icon.png 30 November, 2024 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెల్లబోతున్న రైతు

08-10-2024 03:00:04 AM

  1. తక్కువ ధరకు పత్తి కొనుగోళ్లు 
  2. తేమ పేరుతో వ్యాపారుల దోపిడీ 

ఆందోళనలో రైతులు 

సీసీఐ కేంద్రాల కోసం వినతి 

ఖమ్మం, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఖమ్మం పత్తి మార్కెట్‌లో ఆదిలోనే తెల్ల బంగారానికి గిట్టుబాటు ధర లభించక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక ప్రతికూల పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొని, అరకొరగా చేతికొచ్చిన పత్తికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో నష్టపోతున్నారు.

తెలంగాణలోనే అతిపెద్దదిగా ఖమ్మం పత్తి మార్కెట్‌కు పేరుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి అధిక వర్షాలు, వరదల వల్ల ఖమ్మం జిల్లాలో పత్తిపంట దెబ్బతిన్నది. జిల్లా వ్యాప్తంగా  1,99,700 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి, ఎర్రుపాలెం, మధిర, వైరా, బోనకల్, రఘునాథ పాలెం మండలాల్లో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు.

అయితే అధికారులు మాత్రం ఈసారి జిల్లా వ్యాప్తంగా 1,79,730 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందంటున్నారు. దిగుబడి తగ్గిన కారణంగా గతంలో కంటే ఈసారి మార్కెట్‌లో రికార్డు స్థాయి ధర పలికే అవకాశం ఉందని ఆశపడ్డ రైతులకు ఆదిలోనే నిరాశ మిగిలింది.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పట్ల రైతుల అయిష్టంగా ఉన్నారు. ప్రైవేట్ వ్యాపారులకే పంటను విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ ప్రైవేట్ వ్యాపారులు సీసీఐ కంటే అదనపు ధర చెల్లించి కొనే అవకాశాలు కనిపించడం లేదు. 

క్వింటాలుకు రూ.6వేలే.. 

సోమవారం ఖమ్మం పత్తి మార్కెట్‌కు 328 రైతులు 3,287 బస్తాల పత్తిని తీసుకువచ్చారు. ధర మాత్రం క్వింటాలుకు రూ.6వేల నుంచి రూ.7వేల మధ్యనే పలికింది. కనీస ధర రూ.7,011లుగా ఉన్నదని అధికారులు తెలిపారు. పాత పత్తికి సంబంధించి ఆరుగురు రైతులు 188 బ్యాగులు తీసుకురాగా, కనీస మద్దతు ధర రూ.7,450 మాత్రమే పలికింది. ప్రైవేట్ వ్యాపారులు స్వల్పంగా ధర పెంచి కొన్నారు. 

సిండికేట్‌గా మారిన వ్యాపారులు

ప్రైవేట్ వ్యాపారులంతా సిండికేట్‌గా మారి, ధర తగ్గించి కొనుగోళ్లు జరుపుతుండటంతో రైతులు నష్టపోతున్నారు. మంచిరకం పత్తికి కూడా నాణ్యత లేదనే సాకుతో తక్కువ ధరనే చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. తేమ శాతం తక్కువుగా ఉన్నదనే కారణం చెప్పి, కొత్తగా వచ్చిన పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. చేసిన అప్పులు తీరే మార్గం లేక అందినకాడికి అమ్ముకుంటున్నారు. అధికారులు స్పందించి, పత్తి కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. త్వరగా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు జరిపి, గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. 

రెండో వారంలో సీసీఐ కేంద్రాలు

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5 సీసీ కేంద్రాలు, 10 జిన్నింగ్  మిల్లులలో  కొనుగోలు  కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొడవు పింజ రకం పత్తి క్వింటాల్‌కు రూ.7,521, మధ్య పింజ రకానికి రూ.7,121 ల మద్దతు ధర చెల్లించాలని నిర్ణయించింది. అక్టోబర్ రెండో వారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు పని చేయనున్నాయి.