11-02-2025 12:00:00 AM
‘కంచే చేను మేస్తే’ అన్నట్లుంది ‘నియంత్రణ మండలి’ (యుజీసీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) పద్ధతి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు గుర్తింపు ఇచ్చే సమయంలో యూజీసీ విధించే కొన్ని కఠిన నిర్ణయాలు తు.చ. తప్పక పాటించాలి. లేకపోతే, ఇంకోసారి ఆ విశ్వవిద్యాలయాలకు గుర్తింపు రద్దు చేస్తారు.
కానీ, ఇలాంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్, బోర్డు మెంబర్‌లు అందరూ గతంలో యూజీసీలోను/ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనూ ఉన్నత పదవులు అధిష్టించిన వారే. ప్రైవేటు విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్ పరిశీలిస్తే ప్రతి ప్రైవేటు వర్సిటీలో యూజీసీ, ఏఐసీటీఈ, న్యాక్, ఎన్బీఏలో డైరెక్టర్లు, సలహాదారులు, పేరెన్నిక కలిగిన విశ్వవిద్యాలయాలలో ఉపకులపతిగా పనిచేసిన వారు ఉంటున్నారు.
వీరంతా రిటైరైన తర్వాత తమ కుటుంబంతో గడుపుతుంటారు తప్ప, అక్కడకు వెళ్ళేది కేవలం రెండు నెలలకు ఒకసారి. ‘వీరంతా తమ బలమని’ ఈ విశ్వవిద్యాలయాలు విర్రవీగుతుంటాయి. వారికైతే ప్రభుత్వ, యూజీసీ వివిధ విభాగాలలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, దేనినైనా సులభంగా మార్చవచ్చు అనుకుంటారు. ‘కంచె చేను మేస్తే కాపు ఏమి చేయగలరు’.
పేరున్న కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రత్యేక ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తున్నాయి. వీటికి దాదాపు ఒక్క హైదరాబాద్ నగరంలో సుమారు 25,000 నుంచి 30,000 మంది దాకా విద్యార్థులు హాజరవుతున్నారు. ఒకవైపు ప్రైవేటు విద్యను, సాంకేతిక విద్యను కట్టడి చేశామని, ప్రభుత్వ విద్య బలోపేతం చేశామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు ‘ఏమీ చేయలేని అచేతన స్థితి’లో ఉంది.
రేటింగ్‌ల వెనుక అవినీతి?
గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో ఉన్న కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వరుసగా రెండుసార్లు న్యాక్ ఏ ++ రేటింగ్‌తో గుర్తింపు పొందింది. 2024--2029 కాలానికి తిరిగి గుర్తింపు కోసం విశ్వ విద్యాలయానికి దరఖాస్తు చేసుకుంది. న్యాక్ తనిఖీ జనవరి 29 నుంచి 31 (2024) వరకు జరగాల్సి ఉంది.
అనుకూలమైన రేటింగ్‌ను పొందడానికి తనిఖీకి రెండు వారాల ముందు కెఎల్‌యు అధికారులు న్యాక్ ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ముందుగానే న్యాక్ కమిటీ సభ్యులు విజయవాడ ప్రయాణించారు. విమాన టిక్కెట్లు కేఎల్ విశ్వవిద్యాలయం వారు ఏర్పాటు చేశారు. రూ. 1.80 కోట్ల ఒప్పందంతో అవినీతి చర్చలు ముగిశాయి.
న్యాక్ సమన్వయకర్త, తనిఖీ కమిటీకి అనుకూలమైన నివేదికను రూపొందించడానికి రూ.1.30 కోట్లు చెల్లించారు. బృంద సభ్యునికి రూ. 3 లక్షలు, ల్యాప్‌టాప్స్ సమన్వయ కర్త, పేరొందిన జవహర్‌లాల్ యూనివర్సిటీలో అధ్యాపకుడు ఢిల్లీ నివాసంలో రూ. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.
తనిఖీ సమయంలో, కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు 3.65 లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్‌ను స్పష్టంగా అభ్యర్థించారు. ఇది విశ్వవిద్యాలయం ఏ++ గ్రేడ్‌ను పొందేలా చూసుకుంది. మరిన్ని, ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలు విద్యారంగంతో సంబంధం లేని బ్రోకర్లను, కన్సల్టెన్సీలను ఆశ్రయించి అక్రిడేషన్ పొందుతున్నట్టు తెలుస్తున్నది.
గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేకపోవడం, వాటిలో కీలక విభాగాలు మూసివేయడం, రీసర్చ్ గ్రాంట్లు లేకపోవడం, అధికారంలో ఉన్న పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు, డొనేషన్ ఇచ్చిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు కోట్లు గుమ్మరిస్తున్నారు. మేజర్, మైనర్ ప్రాజెక్టులు, సెమినార్ గ్రాంట్లు అన్నీ ఒక వర్గానికే చేరుతున్నాయి. డబ్బు ఇస్తే ఏదైనా సాధ్యపడుతుంది.
పరిశోధన అటకెక్కింది, రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్టులు సక్రమంగా నిర్వహించరు. ఉపకులపతుల నియామకాల్లో కాలయాపన, విశ్వవిద్యాలయాలలో చేరే సంఖ్య నామమాత్రంగా ఉంటుంది. ఏ మాత్రం వసతులు లేని ఇరుకు గదుల్లో ఉన్న ప్రయివేటు యూనివర్సిటీలలో పట్టుమని పది ఎకరాల స్థలం ఉండదు కానీ, వేలల్లో విద్యార్థులు ఉంటున్నారు.
జనవరి నుంచి సామాజిక మాధ్యమాల ద్వారా రూ.కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇచ్చి విద్యార్థుల దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. ఫీజులు, క్లాస్ నియంత్రణలు ఉండవు. డబ్బు కడితే ఎప్పుడు కావాలన్నా, ఏ కోర్సులో చేరాలన్నా సీటు దొరుకుతుంది. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేసే చాలామంది అధ్యాపకులు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో సీటు రాక దాదాపు 500 కి.మీ. దూరంలోని ప్రైవేటు యూనివర్సిటీలలో పీహెచ్‌డీలో చేరుతున్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థలు నీరు కారడం వల్లే!
అక్కడ వసతులు ఉండవు. రీసర్చ్ సూపర్‌వైజర్లు తరచూ మారుతుంటారు. ఎందులో పీహెచ్‌డీ చేశారో తెలియదు. సన్‌రైజ్, బెస్ట్, జైపూర్ నేషనల్ యూనివర్సిటీ, శ్రీ సాయి, సత్యసాయి, మగధ, బుందేల్ ఖండ్, గోండ్వానా, జంబర్వాల్ ఇలా చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఎకరం భూమి ఉండదు కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ నడుపుతున్నారు.
ఒక్క చెట్టు ఉండదు కానీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏరో స్పెస్ టెక్నాలజీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులు నడిపిస్తున్నారు. వ్యవస్థలో కుక్క తోక ఆడించాలి కానీ, తోక కుక్కను ఆడిస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా అటానమస్ ఇచ్చి అకడమిక్స్‌ను నీరు గార్చారు. ఉపాధ్యా యులు పాఠాలు బోధించడం లేదు. కేవలం న్యాక్, ఎన్బీఏ క్రైటీరియా పనులు చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పట్టించుకోకపోతే రాబోయే రెండు మూడు సంవత్సరాలలో వాటిని శాశ్వతంగా మూసివేసే ప్రమాదం ఏర్పడవచ్చు. ఇటువంటి అనైతిక పద్ధతులే మన ఉన్నత విద్యావ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తాయి. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి విద్యా నైపుణ్యం, ప్రమాణాలు నిలబెట్టడానికి త్వరిత నిర్ణయాత్మక చర్య అవసరం.
డా. యం. సురేష్‌బాబు