calender_icon.png 7 October, 2024 | 2:01 AM

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

06-10-2024 12:00:00 AM

ప్రజా ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ విష ప్రచారం చేస్తోంది

ఎన్ని కుట్రలు చేసినా సంక్షేమ పథకాలను అందరికీ వర్తింపజేస్తాం 

గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సీతక్క

అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 5: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో నిర్వహించిన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.

పాలకవర్గంతో మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చిలుక మధుసూదన్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా సీహెచ్ భాస్కరా చారి, 12 మంది డైరెక్టర్లు, ఇద్దరు ఎక్స్‌అఫిషియో మెంబర్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత పదేళ్లలో రైతులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదని విమర్శించారు.

ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుంటే ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లలో అధికారంలో ఉండి రూ.లక్ష కూడా రుణమాఫీ చేయని బీఆర్‌ఎస్ నాయకులు.. ఇప్పుడు ధర్నాల పేరుతో డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.

పదేళ్లలో ఒక్కసారైనా ఏకకాలంలో రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసినా సంక్షేమ పథ కాలను అందరికీ వర్తింపజేస్తామన్నారు. గడ్డి అన్నారం మార్కెట్ అతిపెద్దది అని.. ఇలాంటి మార్కెట్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. నూతన పాలకవర్గం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అన్ని శాఖల్లో అప్పులే.. 

కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామ ల కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ స్థాయిలో అప్పు ల పాలు చేసిందో అందరికీ తెలుసని అన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఫైళ్లు తీసి చూస్తే అన్ని శాఖల్లో అప్పులే ఉన్నాయని అన్నారు. వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ గడ్డి అన్నారం మార్కెట్‌ను కేటీఆర్ రూ.75 లక్షల రెంట్ చెల్లించే విధంగా చేశాడని విమర్శించారు.

నూతన మార్కెట్ యార్డ్‌కు కృషి.. 

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ.. గడ్డి అన్నారం మార్కెట్ పెద్దది అని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమం లో రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ చైర్‌పర్సన్ పండుగుల జయశ్రీరాజు, బుర్ర మహేందర్‌గౌడ్, చామ విజయశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

రైతుల సంక్షేమానికి కృషి చేస్తా

మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకొనైనా మార్కెట్ కట్టిస్తానని అన్నారు. రైతు మార్కెట్‌లో అవినీతి రహిత పాలన చేస్తానని, తాను 20 ఏళ్లుగా కష్టపడుతూ పైకొచ్చానని చెబుతూ భావోద్వేగానికి లోనవుతూ కంటతడి పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కళ్లలో ఆనందాన్ని నింపేందుకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు.