హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4(విజయక్రాంతి): నేతన్నల సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని, వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని కమ్మ సంఘం భవన్‌లో చేనేత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పోను ఆమె ప్రారంభించి మాట్లాడారు.
టెస్కోకు రావాల్సిన రూ.488.38 కోట్ల నిధుల్లో ఇప్పటికే సర్కార్ రూ.465 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వ సంస్థలకు కావాల్సిన వస్త్రాలను (టీజీఎస్‌సీవో)టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలకు జీవో జారీ చేశామన్నారు. నూలు డిపోను నడిపేందుకు రూ.50 కోట్లతో కార్పస్ ఫండ్‌ను మంజూరు చేశామన్నారు. ఫండ్ సిరిసిలకు నేతన్నలకు ప్రయోజనం చేకూర్చుతుందన్నారు.
నేతన్నకు చేయూత పథకం ద్వారా 36,333 మంది చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు రూ.290 కోట్లు విడుదల చేసి లబ్ధి చేకూర్చామన్నారు. కార్యక్రమంలో హడ్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, అడిషనల్ డైరెక్టర్ వెంకటేశం, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్లు ఎన్.వెంకటేశ్వరరావు, ఇందుమతిదేవి, హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఓఎస్‌డీ బాషా, టెస్కో జీఎం అశోక్‌రావు పాల్గొన్నారు.