27-02-2025 01:16:36 AM
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 26: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రతి గ్రామంలో, వీధులలో శివనామ స్మరణం మార్మోగింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోటిలింగాల దేవాలయంలో భక్తులు గంటల తరబడి వరసలో నిలబడి దర్శనం చేసుకున్నారు. లింగాలపై పాలు పోసి అభిషేకం చేశారు.
తొగుట మండలంలోని కోటిలింగాల దేవాలయంలో, దౌల్తాబాద్ మండలం లోని దక్షిణ కాశీగా పిలవబడే శివాలయంలో, కొండపాక మండలం దుద్దెడలోని స్వయంభు, శంభు లింగేశ్వర, నారాయణరావుపేట మండలంలోని స్వయంభు బుగ్గ రాజేశ్వర స్వామి, నాచగిరి లక్ష్మీనరసింహస్వామి, వర్గల్ మండల కేంద్రంలోని సరస్వతి, ప్రజ్ఞాపూర్ లోని పార్థివేశ్వర స్వామి, అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో,
హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి లోని లక్ష్మీనరసింహ స్వామి, బెజ్జంకిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాలలో శివపార్వతుల కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతుల కళ్యాణాన్ని ఆసక్తిగా తిలకించారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు తీసుకొని ఉపవాసాలు విడిచి మొక్కులు చెల్లించుకున్నారు.